నేటి నుంచి 20 వరకు టీఆర్ఎస్ కమిటీల ఎంపిక
నెలాఖరుకు జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి
ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ
పార్టీ కోసం పనిచేసే వారినే వరించనున్న పదవులు
గులాబీ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
టీఆర్ఎస్ అధిష్టానం గ్రామ స్థాయి నుంచే పటిష్టమైన పునాది వేసేందుకు కార్యాచరణ రూపొందించింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు పార్టీని మరింత బలోపేతం చేసే ప్రక్రియ షురూ
అయ్యింది. ఇందులో భాగంగా జెండా పండుగ అనంతరం కమిటీలు వేయాలని అధిష్టానం నిర్ణయించింది. శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు కమిటీలను ఎంపిక చేయనున్నారు. 12 వరకు గ్రామ పంచాయతీ, వార్డు
కమిటీలకు, 13 నుంచి 20 వరకు పట్టణ, మున్సిపల్ కమిటీలను ఎంపిక చేయనున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా కమిటీలను కూడా ఎన్నుకోనున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసేలా
అడుగులు వేస్తున్నారు. గ్రామ, వార్డు, మండల కమిటీలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఈ ప్రక్రియను ఎమ్మెల్యేలు పర్యవేక్షించనున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతల్లో పదవుల సందడి మొదలైంది.
వనపర్తి, సెప్టెంబర్2(నమస్తే తెలంగాణ): గులాబీ పార్టీ నేతల్లో పదవుల సందడి మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు పార్టీ సంస్థాగతంగా మరింత బలంగా తయారు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించనున్నారు. జెండా పండుగ అనంతరం కమిటీలు వేసేలా అధిష్ఠానం ఆదేశాలు ఇవ్వడంతో పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు తమకు పదవులు వస్తాయనే ఆశతో తమ ఆశాభావాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి వద్ద వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
వనపర్తి జిల్లా విషయానికొస్తే నాలుగు నియోజకవర్గాలు కలిసి ఉండటం వల్ల జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల్లో వనపర్తి ఎమ్మెల్యే మంత్రి నిరంజన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారు. దేవరకద్ర, కొల్లాపూర్, మక్తల్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి జిల్లా స్థాయి పదవుల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. వనపర్తి జిల్లా విషయానికి వస్తే వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో జరుగనున్నది. ఎన్నికలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో ఆశావహులంతా పదవుల కోసం పోటీ పడుతున్నారు. జిల్లాలో క్రియాశీలకంగా పార్టీకోసం, ప్రభుత్వ ప్రతిష్ట దిగజారకుండా పనిచేస్తున్న వారికే ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
జిల్లా అధ్యక్షుడి బాధ్యత సీఎందే..
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేసే బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారు. దీనిని స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తారు. జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే సమయంలో జిల్లాకు చెందిన మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇదే సమయంలో పదవుల్లో మహిళా, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50శాతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కార్మిక, రైతు విభాగాలతోపాటు ఇతర విభాగాలకు కూడా పూర్తి స్థాయి కమిటీలను త్వరలో వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 12వరకు గ్రామ పంచాయతీ, వార్డు కమిటీల నియామకం జరుగుతుంది. 13నుంచి 20 వరకు పట్టణ, మున్సిపల్ కమిటీలకు ఎన్నికలు జరుగుతాయి. గ్రామ, వార్డు, మండలాల కమిటీలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా కమిటీలను కూడాఎన్నుకోనుంది. ఈ నెలాఖరులోగా జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తికానున్నాయి.
అన్ని వర్గాలకు ప్రాధాన్యం
పార్టీ పదవుల్లో పూర్తిగా పారదర్శకత ఉంటుంది. పార్టీకోసం కష్టపడ్డవారికి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక జరుగుతుంది. పార్టీ ఇప్పటికే సంస్థాగతంగా ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో ఉంది. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి అండగా ఉండే వారందరికీ న్యాయం జరుగుతుంది.