నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం
మీటర్ దూరంలో సర్కిల్స్ ఏర్పాటు
ఇక ఆటాపాటలకు విద్యార్థులు బైబై
గురుకులాలకు అనుమతి లేదు
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం
మీటర్ దూరంలో సర్కిల్స్ ఏర్పాటు
ఇక ఆటాపాటలకు విద్యార్థులు బైబై
గురుకులాలకు అనుమతి లేదు
బడికి వేళైంది. ఇక విద్యార్థులు ఆటాపాటలకు బైబై చెప్పనున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇన్ని రోజులు పాఠశాలలు మూతబడగా.. కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే కొనసాగాయి. వివిధ సమస్యల కారణంగా ఈ తరగతుల నిర్వహణ సక్రమంగా సాగలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు బోధన కొనసాగించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పాఠశాలలు శుభ్రం చేసి గదుల్లో శానిటేషన్ చేశారు. అయితే గురుకులాలకు మాత్రం అనుమతి లేదు.
వనపర్తి టౌన్, ఆగస్టు31: కొవిడ్ నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభానికి అన్ని విద్యా సంస్థల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాధికారులు సర్వం సిద్ధం చేశారు. వారం రోజులుగా యుద్ధప్రాతిపదికన మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు పారిశుధ్య కార్మికులతో శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత పనులు చేపట్టారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభమవుతాయా లేదా అనే తర్జన భర్జన మధ్య ఎట్టకేలకు బుధవారం నుంచి పాఠశాలలు కొనసాగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇవీ నిబంధనలు
ప్రభుత్వపరంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ, పీజీ కళాశాలలు తెరవడానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ అయినట్టు వనపర్తి డీఈవో రవీందర్ తెలిపారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలల్లో హాస్టల్స్ సదుపాయాలతో తెరవడానికి అనుమతి లేదని డీఈవో తెలిపారు.
ఏ విద్యార్థినైనా ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావాలని తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బందులు పెట్టకూడదు.
ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్లైన్లో తరగతులు బోధించేందుకు సిద్ధంగా ఉండాలి.
పిల్లవాడు వైరస్ బారిన పడిన పాఠశాలలో ఉన్నప్పుడు ఎలాంటి చట్టపరమైన ప్రభావం ఉండదని అన్ని పాఠశాలల్లో మేనేజ్మెంట్ వారీగా వారంలోపు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించాలి.
తరగతుల నిర్వహణపట్ల పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఉచితమైన ప్రచారం నిర్వహించాలని ఫీల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
పౌష్టికాహారం సిద్ధం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సర్వం సిద్ధం చేశామని డీఈవో రవీందర్ తెలిపారు. ఇప్పటికే సివిల్ సప్లయ్ అధికారి అనిల్‌కుమార్ పర్యవేక్షణలో విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి పాఠశాల పాయింట్‌కు రేషన్ అందజేశామని డీఈవో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 15కేజీబీవీలు, 3 మైనార్టీ పాఠశాలలు, 3 బీసీ గురుకులాలు, 509 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 5సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, 3 మోడల్ స్కూల్స్, 6 ప్రభుత్వ పాఠశాలలు, 3 గవర్నమెంట్ పాఠశాలలు, 2మైనార్టీ గురుకులాలు, ఒక ఆశ్రమ పాఠశాల, ఒక అర్బన్ గురుకులం, 369 ప్రైమరీ స్కూల్స్, 115 ఉన్నత పాఠశాలలు, 80యూపీఎస్‌తో మొత్తం 544 పాఠశాలలున్నాయి. 44వేలకు పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అందించేందుకు ఇప్పటికే పాఠశాలలకు బియ్యాన్ని అందజేశామని డీఈవో తెలిపారు.
గురుకులాలకు మినహాయింపు
మైనార్టీ, ట్రైబల్, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ తదితర గురుకులాలకు వారంరోజుల పాటు హాస్టల్స్, క్లాస్‌లకు కోర్టు సూచనల మేరకు మినహాయింపు ఇచ్చారు. పూర్తిస్థాయి సదుపాయాలతో గురుకులాల్లో కూడా ప్రత్యక్ష బోధన జరుగనున్నది.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ, పీజీ కళాశాలలు తెరవడానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్-19 నిబంధనలు పాటించేందుకు ప్రతి పాఠశాలలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా మీటర్ దూరంలో సర్కిల్‌ను అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు వ్యక్తిగతంగా మాస్క్‌లు, శానిటైజర్, వాటర్ బాటిల్‌ను తమవెంట తెచ్చుకోవాలి. ఉపాధ్యాయులు గందరగోళాన్ని వీడి సకాలంలో తప్పనిసరిగా పాఠశాలలకు హాజరుకావాలి.