కమ్మర్పల్లి, జనవరి 12: భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడు స్వామి వివేకానందుడు అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని చౌట్పల్లిలో వివేకానంద విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డితో కలిసి ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర గొప్పదన్నారు. వివేకానందుడి సూక్తులు, బోధనలు ఆచరణీయమని తెలిపారు. చౌట్పల్లిలో లైబ్రరీ, మెట్ల చిట్టాపూర్ రోడ్డు అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన యువజన సంఘాల బాధ్యులు, విగ్రహ దాత గంగప్రసాద్ దీక్షితుడిని మంత్రి అభినందించారు. సురేశ్‌రెడ్డితో కలిసి వారిని సన్మానించారు. యువకులు, ప్రజా ప్రతినిధులు కలిసి మంత్రిని, రాజ్యసభ సభ్యుడిని సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ‘జోష్ మే రహో.. హోష్ మే రహో’ అనే వివేకానందుడి సూక్తిని గుర్తుచేశారు. గ్రామాభివృద్ధికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, తాను ఎళ్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. మంత్రితో పాటు కేఆర్ సురేశ్‌రెడ్డికి యువకులు కమ్మర్పల్లి హైవే నుంచి చౌట్పల్లి వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమాలను వివేకానంద సేవా సమితి, హన్మంత్ రెడ్డి లైబ్రరీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు భాస్కర్ యాదవ్, సర్పంచ్ మారు శంకర్, ఎంపీటీసీ ఏశాల నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ కుంట ప్రతాప్, వీడీసీ అధ్యక్షుడు ఎలాల శంకర్, కోశాధికారి మోహన్, ఆల్ యూత్ అధ్యక్షుడు నిరంజన్, గ్రంథాలయ కమిటీ సభ్యుడు అంజయ్య, శంకర్ గౌడ్, బట్టు అశోక్, గోపిడి లింగా రెడ్డి, వెంకట్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మీ జవాన్‌కు సన్మానం..
కమ్మర్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్ పవార్ శ్రీనివాస్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి చౌట్పల్లిలో సన్మానించారు. సిక్కింలో విధులు నిర్వహిస్తూ సెలవుపై ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ను గ్రామంలో వివేకానంద విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సత్కరించారు.