జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రతి రోజు ఒకచోట ప్రత్యేక వైద్య శిబిరం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సర్వే నివేదిక అందజేత ప్రజారోగ్యమే పరమావధిగా సీజనల్ వ్యాధులు సోకకుండా రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని జిల్లా వైద్య శాఖను ఆదేశించగా, వికారాబాద్ జిల్లాలో బుధవారం వైద్య సిబ్బంది సర్వేను ప్రారంభించారు. వర్షాలు అధికంగా కురిసిన గ్రామాల్లో ఈగలు, దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది వ్యాధుల బారినపడే అవకాశమున్నది. కావున ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ముందుగా ఆ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటి పరిధిలో 154 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలోని గ్రామాల్లో మూడు వారాల్లోపే జ్వర సర్వేను పూర్తి చేసేందుకు చర్యలను ముమ్మరం చేశారు. ఏ గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి.. ఎంతమందికి వ్యాధి సోకింది.. లక్షణాలున్నవారెందరన్న పూర్తి వివరాలను సేకరించి, ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారులకు నివేదిక పంపిస్తున్నారు.
పరిగి, సెప్టెంబర్ 29: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందు లో భాగంగా ఇంటింటి జ్వర సర్వేకు ఆదేశించిం ది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇంటింటి జ్వర సర్వే బుధవారం ప్రారంభమైనది. ఈ సర్వే మూ డు వారాలపాటు కొనసాగనున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఏ సబ్‌సెంటర్ పరిధిలో ఎక్కువగా వర్షాలు (ఏగ్రామాల్లో) కురిశాయి, వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది గుర్తించి ఆయా గ్రామా ల్లో ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస్తారు. ఇందుకుగానూ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని గ్రామాల ఎంపిక చేసి ఇంటింటి సర్వే ప్రారంభించారు. ప్రతిరోజూ సాయంత్రం సర్వేకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలతో కూడిన నివేదికను జిల్లా స్థాయి అధికారులకు అందజేస్తారు.
ఇంటింటికీ వెళ్లి సర్వే…
ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు బుధవారం ప్రత్యేక సమావేశాలు జరిపి ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిశాయి, ఎక్కడ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నదనే విషయాన్ని గుర్తించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న గ్రామాల్లో మొదట ఈ సర్వే నిర్వహిస్తున్నారు. జ్వరంతోపాటు నీరు కలుషితం వల్ల ఏమైనా వ్యాధు లు ప్రబలడం జరిగిందా, దోమ లు, ఈగల వల్ల ఏ వ్యాధులు ప్రబలుతున్నాయనే విషయాలపై పూర్తిస్థాయిలో సర్వే చేపడుతారు. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వఉండి కలుషితమయ్యే ప్రమాదం ఉందా అనే విషయాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత గ్రామపంచాయతీ అధికారులకు సూచించారు. దోమలు, లార్వాలు పెరిగే అవకాశం ఉంటే నీరు నిల్వకుండా చూడాలని సూచిస్తారు.
సాయంత్రం వరకు సర్వే నివేదిక…
ఏ గ్రామంలో ఎన్ని ఇండ్లు సర్వే చేశారు, ఎంతమందికి సీజనల్ వ్యాధులు సోకాయో పూర్తిస్థాయి వివరాలతో కూడిన సర్వే నివేదిక ప్రతిరోజూ సాయంత్రం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి పంపించాలి. ప్రతి రోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఏదో ఒకచోట సర్వేలో పాల్గొనడంతోపాటు ఆ కేంద్రం పరిధిలోసీజనల్ వ్యాధులు అధికంగా ఉన్న చోట వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి. వైద్య శిబిరంలో ఎంత మందికి వైద్యం చేశారనేది సైతం నివేదికలో పొందుపర్చాలి. ఇంటింటి సర్వే మూడు వారాలపాటు కొనసాగుతున్నది. ప్రతిరో జూ ఈ సర్వేను జిల్లా స్థాయి అధికారులు సైతం పర్యవేక్షిస్తారు. తద్వారా మరింత పకడ్బందీగా సర్వే చేయడంతోపాటు ఎక్కడ సీజనల్ వ్యాధులు ప్రబలినా వెంటనే వైద్య సహాయం అందజేయటానికి ఈ సర్వే దోహదం చేయనున్నది.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ఎక్కడికక్కడే వైద్య సేవలు అందిం చేందుకు ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్నాం. వికారాబాద్ జిల్లా పరిధిలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో సర్వే మూడు వారాలపాటు కొనసాగుతున్నది. వర్షాల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులు, దోమలు, ఈగల వల్ల సోకే వ్యాధులు, నీరు కలుషితం వల్ల వ్యాపించే వ్యాధులపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కువగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నచోట ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడం జరుగుతున్నది.
-డాక్టర్ తుకారాంభట్, జిల్లా వైద్యాధికారి, వికారాబాద్ జిల్లా
నేటి నుంచి మూడు రోజులు కేంద్ర బృందం పర్యటన
పరిగి, సెప్టెంబర్ 29: కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారుల బృందం మూడు రోజులు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నది. నేషనల్ హెల్త్ మిషన్‌కు సంబంధించి అమలు జరుగుతున్న కార్యక్రమాలను వారు పరిశీలిస్తారు. కేంద్రానికి చెందిన ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులతోపాటు రాష్ర్టానికి చెందిన మరో అధికారి బృందంలో సభ్యులుగా ఉంటారు. గురువారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు వికారాబాద్ జిల్లా పరిధిలోని జిల్లా దవాఖాన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలను వారు సందర్శించనున్నారు. ఇందులో భాగంగా ఆయా దవాఖానలు, కేంద్రాల్లో అమలు జరుగుతున్న కార్యక్రమాలను వారు పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలు, ప్రసవాలు, ఇమ్యునైజేషన్, విలేజ్ శానిటైజేషన్, విలేజ్ న్యూట్రిషన్ డే కార్యక్రమాల అమలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్ల పనితీరు ఎలా ఉన్నది తెలుసుకోనున్నారు. అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి రికార్డులు ఎలా నిర్వహిస్తున్నారనే విషయాలను వారు పరిశీలించనున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సైతం వారు వివరాలు సేకరిస్తారు. తాండూరులోని జిల్లా దవాఖానలోని నియో నాట్రల్ కేర్ యూనిట్, న్యూట్రిషనల్ రిహాబిలేషన్ సెంటర్‌ను వారు సందర్శించి, అక్కడ అందుతున్న సేవలను తెలుసుకుంటారు. కేంద్ర బృందం పర్యటనలకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.