
జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్
బొంరాస్‌పేట, ఆగస్టు 28 : కరోనా వైరస్ నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. శనివారం మండలంలోని చెట్టుపల్లితండా కేజీబీవీ, బొంరాస్‌పేట ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిని శానిటైజేషన్ చేయాలని, పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేయాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, తరగతి గదుల వివరాలను ఆయన హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దుప్‌చెర్ల ప్రాథమిక పాఠశాలను జడ్పీ సీఈవో జానకీరెడ్డి సందర్శించారు. అధికారుల వెంట ఎంపీడీవో పవన్‌కుమార్, ఎంఈవో రాంరెడ్డి, ఎంపీవో పాండు, హెచ్ఎంలు పాపిరెడ్డి, రాధిక ఉన్నారు.
శానిటైజేషన్‌పై శ్రద్ధ చూపాలి
కొడంగల్, ఆగస్టు 28 : అన్ని పాఠశాలల్లో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శానిటైజేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సూచించారు. శనివారం మున్సిపల్ పరిధిలో ఆకస్మికంగా పర్యటించి జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో పాటు ఎస్సీ హాస్టల్‌ను సందర్శించి శానిటైజేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చేపడుతున్న శానిటైజేషన్ పనులపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల హెచ్ఎంలతో పాటు ఎస్సీ హాస్టల్ వార్డన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
శానిటేషన్ పనులు పూర్తి చేయాలి
దోమ, ఆగస్టు 28 : పాఠశాలలు తెరిచే లోపు శానిటేషన్ పనులు పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ కృష్ణన్ అన్నారు. దోమ మండల పరిధిలోని బొంపల్లి, మోత్కూర్ గ్రామాల్లోని పాఠశాలలను ఆయన శనివారం సందర్శించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలను ఆగస్టు చివరి నాటికి పరిశుభ్రం చేసి శానిటేషన్ పనులను సైతం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చే విదంగా చర్యలు చేపట్టాలన్నారు. మండల కేంద్రంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రం చేయిస్తున్నట్లు సర్పంచ్ రాజిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీవో వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండో విడుత పాఠ్యపుస్తకాల పంపిణీకి సిద్ధం
తాండూరు రూరల్, ఆగస్టు 28 : రెండో విడుత పాఠ్యాపుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తాండూరు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు గతంలో మొదట విడుతలో కొన్ని పాఠ్యాపుస్తకాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠ్యాపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఎంఈవో వెంకటయ్యగౌడ్ తెలిపారు. ఇప్పటికే అన్ని పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం ఇచ్చామన్నారు.
పాఠశాలలో పారిశుద్ధ్య పనులు
పెద్దేముల్, ఆగస్టు 28 : మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సర్పంచ్ పి.బల్వంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భోజ్యానాయక్ శనివారం గ్రామ పంచాయతీ కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించారు. ఈ సందర్భంగా మారేపల్లి సర్పంచ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పి.బల్వంత్‌రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో అన్ని రకాలుగా పరిశుభ్రత పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల పారిశుధ్య సిబ్బంది, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అంగడి చిట్టంపల్లి పాఠశాలలో..
పూడూరు, ఆగస్టు 28 : మండల పరిధిలోని అంగడి చిట్టంపల్లి హై స్కూల్, ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో ఉష సందర్శించి సమస్యలపై సర్పంచ్ బి.జయమ్మను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయవచ్చాన్నారు. సర్పంచ్ జయమ్మ మాట్లాడుతూ పాఠశాలల్లో సమస్యలు లేకుండా అందరి సహకారంతో పరిష్కరిస్తామన్నారు. వీరితో పాటు ఉప సర్పంచ్ లక్ష్మీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాఘవేందరచారి, ప్రభాకర్‌రెడ్డి, చెన్నయ్యగౌడ్ ఉన్నారు.
పాఠశాలను పరిశుభ్రం చేయాలి
పూడూరు, ఆగస్టు 28 : పాఠశాల తరగతి గదులను సర్పంచ్ల సహకారంతో పరిశుభ్రం చేయాలని మండల ప్రత్యేకాధికారి సుధారాణి పేర్కొన్నారు. శనివారం పూడూరు మండల కేంద్రంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎంఈవో హరిచందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాలల గదులల్లో, బయట శానిటైజ్ చేయాలని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉష, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
శానిటైజ్షన్ చేయాలి
మోమిన్‌పేట, ఆగస్టు 28 : పాఠశాలలు శుభ్రపరిచి శానిటైజ్షన్ చేయాలి జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ అన్నారు. మోమిన్‌పేట, వెల్చాల్, మేకవనంపల్లి, చంద్రాయన్ పల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో శైలజారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు విఠల్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.