బొంరాస్‌పేట, సెప్టెంబరు 26: పిల్లలమర్రి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉందని తెలుసు. కానీ వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలో కూడా అలాంటి పిల్లల మర్రే ఒకటి ఉంది. మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న భారీ మర్రి చెట్టుకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఐదెకరాల్లో విస్తరించిన ఈ మర్రిచెట్టు మొదలు ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవరూ గుర్తించలేదు. ఊడలు, ఊడలుగా మర్రిచెట్టు విస్తరించి ఉన్న స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి ఆదరిస్తే ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో, మదన్‌పల్లికి కిలో మీటరు దూరంలో ఐదెకరాల్లో ఈ మర్రిచెట్టు విస్తరించి ఉంది. దీనికి సుమారు నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతారు.
బాబన్‌సాబ్ దర్గా మహత్యం
మర్రిచెట్టు కింద బాబన్‌సాబ్ దర్గా ఉంది. పూర్వకాలంలో బాబన్‌సాబ్ సవారి నిండి మొక్కుబడులు చెప్పేవాడు. ఆయన చనిపోతే ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతంలోనే సమాధి చేశారు. దర్గాకు సమీపంలో గుండం ఉంది. గతంలో పీర్ల పండుగ సందర్భంగా ఊరేగింపులో వెలుతురు కోసం వెలిగించే దివిటీల్లో ఈ గుండంలోని నీళ్లు పోస్తే అవి వెలిగేవని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికీ వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దర్గా వద్దకు వచ్చి కందూర్లు చేస్తారు. ప్రతి రెండేండ్లకోసారి లంబాడాలు జరుపుకొనే దసరావ్ పండుగలకు వందల సంఖ్యలో కందూర్లు చేస్తారు. బాబన్‌సాబ్ దర్గా మహత్యం మూలంగానే మదన్‌పల్లిలో 25 మందికి బాబయ్య అనే పేర్లున్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో బాబయ్య అనే పేరున్న వ్యక్తి ఉంటాడు.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మర్రిచెట్టుకు సరైన ఆదరణ లేక ప్రాచుర్యంలోకి రాలేదు. గ్రామం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న చెట్టు వరకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. రోడ్డు సౌకర్యం కల్పించి మర్రిచెట్టు ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలి
మదన్‌పల్లి సమీపంలోని మర్రిచెట్టు చాలా ఏండ్ల కిందటిదని చెబుతారు. దీని చారిత్రక నేపథ్యాన్ని కాపాడుతూ పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలి. దర్గా వద్దకు చాలామంది భక్తులు వస్తుంటారు. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి చెట్టు వరకు కిలో మీటరు దూరం రోడ్డు వేయాలి.
రాజేశ్వరి, సర్పంచ్ మదన్‌పల్లి