యాదాద్రి, సెప్టెంబర్ 25 : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి సన్నిధిలో శనివారం నిత్యపూజలు కోలాహలంగా సాగాయి. తెల్లవారుజామున సుప్రభాతం నిర్వహించి స్వామివారిని మేల్కొల్పిన అర్చకులు ఆర్జిత పూజలను ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు జరిపారు. శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని, సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య తిరుకల్యాణమహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. సాయంత్రం వేళ అలంకార వెండిజోడు సేవలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. కొండకింద గోశాల వద్ద గల మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. దర్శనం అనంతరం ప్రీతికరమైన స్వామివారి లడ్డూను కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. కొండపైన ప్రసాదాలను కొనుగోలు చేశారు. శ్రీవారి ఖజానాకు శనివారం రూ.10,01,568 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శివాలయం రథశాలకు శివపార్వతుల విగ్రహాలు
యాదాద్రి, సెప్టెంబర్ 25 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ శివాలయం ప్రధానాలయ పనులు దాదాపు పూర్తికాగా, క్యూ లైన్లు, నంది, శివలింగం ప్రతిష్ఠాపన పనులు జరుగుతున్నాయి. హరిహరుల పుణ్యక్షేత్రంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రిలో శివాలయానికి చెందిన రథశాలను ప్రత్యేక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. పైబర్ మెటీరియల్తో రూపొందించిన వివిధ రకాల ఆకృతులు, దేవతామూర్తులను పొందుపరిచే పనులు సాగుతున్నాయి. రథశాల పైభాగంలో నిర్మించిన పైబర్ సాలాహారాల్లో నందిపై కూర్చున్న శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. దాంతో రథశాల నలమూలలా శివపార్వతుల విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. శైవగామశాస్త్రం ప్రకారం రథశాలను వైటీడీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,31,006
రూ.100 దర్శనం టిక్కెట్ 30,900
వీఐపీ దర్శనాలు 90,000
వేద ఆశీర్వచనం 3,612
నిత్యకైంకర్యాలు 4,402
క్యారీబ్యాగుల విక్రయం 3,000
వ్రత పూజలు 41,000
కల్యాణకట్ట టిక్కెట్లు 19,200
ప్రసాద విక్రయం 4,31,335
వాహన పూజలు 9,200
టోల్గేట్ 1,220
అన్నదాన విరాళం 7,049
సువర్ణ పుష్పార్చన 1,20,680
యాదరుషి నిలయం 54,180
పాతగుట్ట నుంచి 13,320
ఇతర విభాగాలు 13,784