
కరోనా వల్ల ఆగిన సర్వే… తిరిగి ప్రారంభం
ప్రతి ఇంటి పూర్తి వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
మున్సిపాలిటీల్లోని గృహాలకు జియో ట్యాగింగ్
నాలుగు మున్సిపాలిటీల్లో 39,502 ఇండ్లు
ఇప్పటి వరకు 19,485 ఇండ్ల సర్వే పూర్తి
సేకరించిన వివరాలను వెబ్సైట్లో అప్లోడ్
విధులు నిర్వహిస్తున్న
14 మంది బిల్లు కలెక్టర్లు, టీం సభ్యులు
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు మున్సిపాలిటీల్లో భువన్ సర్వే శరవేగంగా సాగుతున్నది. కరోనా నేపథ్యంలో గతేడాది ఆగస్టులో నిలిపివేసిన సర్వేను తిరిగి త్వరితగతిన పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. 14 మంది బిల్లు కలెక్టర్లు, పలు సర్వే టీంలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఇంటి నిర్మాణం, స్థలాల డాక్యుమెంట్లు, భవన విస్తీర్ణం, ఇంటి నంబర్, కమర్షియల్ కరెంట్, పన్ను తదితర వివరాలను సేకరించి ట్యాబ్‌లలో నమోదు చేస్తున్నారు. జిల్లాలో 39,502 ఇండ్లు ఉండగా, ఇప్పటి వరకు 19,485 ఇండ్ల సర్వే పూర్తైంది. సర్వే పూర్తైన ఇండ్ల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి ఇంటి వివరాలను తెలుసుకునేలా జియో ట్యాగింగ్ చేసి గూగుల్ మ్యాప్‌లో పొందుపరుస్తున్నారు. భువన్ సర్వేలో రాష్ట్రంలోనే వికారాబాద్ మున్సిపాలిటీకి 19వ స్థానం దక్కింది.
వికారాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేసేందుకు భువన్ సర్వే చేపడుతున్నారు. సర్వేలో భాగంగా సిబ్బంది ప్రతి అంశాన్ని నమోదు చేస్తున్నారు. గతేడాది ఆగస్టు మాసంలో సర్వే చేపట్టి కరోనా కేసులు పెరుగడంతో మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుతం తిరిగి ఇటీవల సర్వే చేపట్టాలని ఆదేశాలు రావడంతో సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 39వేల మేర గృహాలు ఉన్నాయి. గతేడాది 5నుంచి 10వేలకు పైగా గృహాల సర్వే పూర్తయింది. ప్రస్తుతం బృందాలను ఏర్పాటు చేసి మిగిలిన గృహాల సర్వే చేయిస్తున్నారు. ప్రతి టీంలో ముగ్గురు నుంచి ఆరుగురు సభ్యులు ఉండి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు అన్ని మున్సిపాలిటీల్లో సర్వే కొనసాగుతున్నది.
సర్వే చేస్తున్న అంశాలు..
ఇంటి నిర్మాణం, స్థలాల డాక్యుమెంట్లు, భవన విస్తీర్ణం, ఇంటి నంబర్, కమర్షియల్ కరెంట్, నల్లా పన్ను తదితర వివరాలను ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. అలాగే కొలతలు తీసుకుని వివరాలు పొందుపరుస్తున్నారు. టీం సభ్యులు వారి మొబైల్ ఫోన్లలో భువన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని గృహాల ఫొటోలు, లొకేషన్ తదితర వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రూట్ మ్యాప్‌తో సహా అన్ని వివరాలు ఎంట్రీ చేస్తున్నారు. సర్వేలో సేకరించిన వివరాలను సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్) వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెలఖారు వరకు సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు అందడంతో వేగవంతం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 39,502 ఇండ్లు ఉండగా, ఇప్పటి వరకు 19,485 ఇండ్ల సర్వే పూర్తి అయింది. తాండూరులో 16,309, వికారాబాద్‌లో 13866, కొడంగల్‌లో 3827, పరిగిలో 5500 చొప్పున ఇండ్లు ఉన్నాయి.
ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్..
మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటికి జియోట్యాగింగ్ చేసి గూగుల్ మ్యాప్‌లో పొందుపరుస్తారని అధికారులు చెబుతున్నారు. గూగుల్‌లో లొకేషన్‌తో పాటు అన్ని వివరాలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో భువన్ సర్వే షురూ చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 13,886 ఇండ్లు ఉండగా 9609 ఇండ్ల సర్వే పూర్తి చేశారు. 4277 ఇండ్లకు సంబంధించి సర్వే చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. 14 మంది బిల్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో 16309 ఇండ్లు ఉన్నాయి. గతంలో 2450 ఇండ్లను సర్వే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆరుమంది టీంతో భువన్ సర్వే జియో ట్యాగింగ్ చేస్తున్నారు.ఈ వారం రోజుల్లో దాదాపుగా 260 వరకు సర్వే జరిగినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 3827 ఇల్లు ఉన్నాయి.వీటి పరిధిలో గతంలో 1188 ఇండ్ల సర్వే చేశారు.మొత్తం 2366 ఇండ్ల సర్వే పూర్తి అయ్యింది.పరిగి మున్సిపాలిటీ పరిధిలో 5500 ఇండ్లు ఉండగా ఇప్పటి వరకు 4800 ఇండ్ల సర్వే పూర్తి చేశారు. వికారాబాద్‌లో 15 మంది ప్రతి రోజు సర్వేలో పాల్గొంటున్నారు. తాండూరులో ఇదే మాదిరిగా సర్వే సాగుతున్నది. పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో సిబ్బందితో కొంత మంది విద్యార్థులతో సర్వే సాగిస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటి వివరాల సేకరణ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాం
ఈ నెలాఖరు వరకు సర్వే పూర్తి చేస్తాం. భువన్ సర్వే ద్వారా ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ అవుతున్నది. టీం సభ్యులు వారి మొబైల్ ఫోన్లలో భువన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని గృహాల ఫొటోలు, లొకేషన్ తదితర వివరాలను నమోదు చేసుకుంటున్నాం. రూట్ మ్యాప్‌తో సహా అన్ని వివరాలు ఎంట్రీ చేస్తున్నాం. సర్వేలో సేకరించిన వివరాలను సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్) వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాం.