
ఉపాధ్యాయులకు సమగ్ర వికాస శిక్షణ
నిష్ట పేరుతో నిర్వహణ
వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకే..
సద్వినియోగం చేసుకోవాలంటున్న విద్యాశాఖ
ఉపాధ్యాయులకు సమగ్ర వికాస శిక్షణ(నిష్ట)
వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు దోహదం
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం నిష్ట పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నది. కొవిడ్ -19తో కొంతకాలంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం లేదు. దీంతో ఆయా సబ్జెక్టులపై టీచర్లు పట్టు కోల్పోకుండా వారిలో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శిక్షణ ఆగస్టులో ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.
వికారాబాద్, ఆగస్టు 20, (నమస్తే తెలంగాణ) : కొవిడ్ -19తో ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ కావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం సాధ్యమవడంలేదు. దీంతో ఆయా సబ్జెక్టులపై టీచర్లు పట్టు కోల్పోకుండా వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. సమగ్ర వికాస శిక్షణ(నిష్ట) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యా-విషయక అంశాలు ఎన్ఈపీ-2020చే సిఫారసు చేయబడి, విద్యార్థి, ఉపాధ్యాయుల సమగ్ర వికాసానికి ఇచ్చిన కాలపరిమితిలో జరుగాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఈ శిక్షణ ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
వృత్తి నైపుణ్యత పెంచుకోవడానికే..
ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు సులభతరమైన బోధన అందించేందుకు నిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోధన మూస పద్ధతిలో కాకుండా ఆధునిక సమాజానికి అనుగుణంగా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా బోధించాలనే ఉద్దేశంతో నిష్ట కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు మినహా మిగతావారందరు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
19 అంశాలు.. 13 మాడ్యూళ్లు
ఉపాధ్యాయులకు దాదాపు 19 రకాల అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. విద్యా ప్రణాళిక, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం, అభ్యసనా ఫలితాలు, సమ్మిళిత విద్య, సురక్షితమైన, ఆరోగ్యకరమైన పాఠశాల ఆధారిత మదింపు, బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యసన మదింపులో సమాచార భావప్రసార-సాంకేతికత జోడించడం, పాఠశాల విద్యలో కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన సిలబస్‌ను తయారు చేసి ఆన్లైన్లో బోధించనున్నారు.
ఉపాధ్యాయులు ప్రతి నెల కేటాయించిన సిలబస్‌ను పూర్తి చేయాలి. మొత్తం 19 అంశాలకు 13 మాడ్యూళ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ఫోన్, కంప్యూటర్ ద్వారా దీక్షా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఏ నెలలో ఇచ్చిన కోర్సు ఆ నెలలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని సబ్జెక్టులు పూర్తి చేసి ఉపాధ్యాయులకు ఎస్సీఈఆర్టీ తుది పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందజేయనున్నారు.
1984 మంది ఆన్లైన్లో నమోదు
ప్రస్తుత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సబ్జెక్టు టీచర్లకు అన్ని యాజమాన్యాలకు కలిపి ఆన్లైన్ పద్ధతి ద్వారా శిక్షణ ఇస్తారు. మొత్తం 1984 మంది ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంటుంది. 1వ మాడ్యూల్లో 1784, 2వ మాడ్యూల్లో 1451, 3వ మాడ్యూల్లో 934 మంది ఉపాధ్యాయులున్నారు. నిష్ట అనేది స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, సీఆర్టీలకు 13 మాడ్యూల్స్‌లో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది.
దిశా నిర్దేశం : రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్ జిల్లా
నిష్టపై ప్రధానోపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశాం. ఈ సమగ్ర వికాస కార్యక్రమ ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఉపాధ్యాయులకు మంచి అవకాశం. ప్రతి టీచర్‌కు సమగ్ర వికాస కార్యక్రమం(నిష్ట) అవసరం. ఉపాధ్యాయులకు ఎస్సీఈఆర్టీ పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి.