e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జిల్లాలు పాడికి రుణాలు

పాడికి రుణాలు

  • దళితులకు సబ్సిడీపై పాడి పశువులు
  • ఎస్సీ నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టు
  • వికారాబాద్‌ నియోజకవర్గంలో 215 మందికి, నవాబుపేట్‌లో 40 మందికి పాడి పశువులు
  • ఎంపికైన గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రెండు పాడి పశువులు
  • ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర సర్కార్‌
  • ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి 70 శాతం సబ్సిడీ
  • బ్యాంకుల నుంచి 30 శాతం రుణం
  • మండల పరిషత్‌, కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ నెల 23వ తేదీ లోపు

దళితుల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందించేందుకు రాష్ట్ర సర్కార్‌ పలు పథకాలను అమలు చేస్తున్నది. ఎస్సీ నియోజకవర్గాల్లోని గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పాడి పశువులను అందించేందుకు ప్రణాళికను రూపొందించింది. వికారాబాద్‌ నియోజకవర్గంలో 215 మందికి, నవాబుపేట్‌లో 40 మందికి పాడి పశువులను అందజేయనుండగా, పలు గ్రామాలను సైతం ఎంపిక చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి 70 శాతం సబ్సిడీ, బ్యాంకుల నుంచి 30 శాతం రుణ సదుపాయంతో ఒక్కో కుటుంబానికి రెండు పశువులను అందజేయనున్నారు. అర్హత కలిగి ఉండి, ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ లోపు మండల పరిషత్‌, కమిషనర్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

పరిగి, అక్టోబర్‌ 19 : రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులకు సబ్సిడీపై పాడి పశువులు అందజేసేందుకు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడుతలో ఎంపిక చేసిన గ్రామాల్లో దళితులకు ఒక్కో కుటుంబానికి రెండు పాడి పశువులు(బర్రెలు) 70 శాతం సబ్సిడీపై అందజేయనున్నారు. మిగతా 30శాతం ఆయా మండలాల్లోని బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పించేందుకు నిర్ణయించారు. పాడి పశువులు సబ్సిడీపై పొందినవారు పాలను విజయ డెయిరీకే పోయడం తప్పనిసరి. ఓ వైపు దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం తోడ్పాటు అందించనుండగా మరోవైపు పాల ఉత్పత్తి పెంచడం లక్ష్యంగా అమలు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలోని వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో తొలి విడుతలో 215 మందికి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నవాబుపేట మండలంలో 40 మందికి పాడి పశువులు(బర్రెలు) సబ్సిడీపై అందజేయనున్నారు. ప్రతి లబ్ధిదారుకు రెండు పాడి పశువులు అందజేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.

- Advertisement -

ఎంపిక చేసిన గ్రామాలకు..

ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధికారిత పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి రెండు పాడి పశువులు అందజేస్తారు. ఇందుకుగాను మొదటి విడుతలో అమలు చేసే గ్రామాలను ఎంపిక చేశారు. వికారాబాద్‌ మండలంలోని సిద్దులూరు, పీరంపల్లి, పులుసుమామిడి, గొట్టిముక్కల, సర్పన్‌పల్లి, మైలార్‌దేవరంపల్లి, పీలారం, బురాన్‌పల్లి, వికారాబాద్‌ మున్సిపాలిటీ, మర్పల్లి మండలంలోని మర్పల్లి, బుచ్చంపల్లి, రావులపల్లి, పట్లూర్‌, సిరిపురం, బంట్వారం మండలంలోని బంట్వారం, రొంపల్లి, మంగ్రాస్పల్లి, నాగవరం, కోట్‌పల్లి మండలంలోని బార్వాద్‌, కరీంపూర్‌, మోత్కుపల్లి, జిన్నారం, బీరోల్‌, ధారూర్‌ మండలంలోని ధారూర్‌, రుద్రారం, గట్టెపల్లి, కుక్కింద, అల్లిపురం, హరిదాస్‌పల్లి, నర్సాపూర్‌, కెరెల్లి, ఎబ్బనూర్‌, మున్నూరు సోమారం, తరిగోపుల, మైలారం, నాగారం, కుమ్మరిపల్లి, మోమిన్‌కలాన్‌, నాగసముందర్‌, రాజాపూర్‌, గురుదోట్ల, అంపల్లి, నవాబుపేట మండలంలోని అర్కతల, చించెల్‌పేట్‌, మీనాపల్లికలాన్‌, యావాపూర్‌, మోమిన్‌పేట్‌ మండలంలోని బాల్‌రెడ్డిగూడ, చీమలదరి, చక్రంపల్లి, దేవరంపల్లి, ఎన్కతల గ్రామాలను ఎంపిక చేశారు.

లబ్ధిదారులు పాటించాల్సిన నిబంధనలు

దళిత కుటుంబాల వారికి ఒక్కో యూనిట్‌ కింద రెండు పాడి పశువులు (బర్రెలు) అందజేస్తారు. యూనిట్‌ ధర రూ.2లక్షలు ఉండగా ఎస్సీ కార్పొరేషన్‌ 70శాతం సబ్సిడీ కింద రూ.1,40,000 అందజేస్తుంది. మిగతా రూ.60,000 బ్యాంకు ద్వారా రుణంగా ఇప్పిస్తారు. ఇందుకుగాను దరఖాస్తులు ఆహ్వానించారు. అర ఎకరం, ఆపైన భూమి కలిగి ఉన్నవారు ఈ నెల 23లోగా ఆయా మండల కేంద్రాల్లోని మండల పరిషత్‌ కార్యాలయాలు, కమిషనర్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కులం, ఆదాయం, రేషన్‌కార్డు, భూమి పాసు పుస్తకం తదితర సర్టిఫికెట్‌ల జిరాక్స్‌ కాపీలు దరఖాస్తుకు జతపరచాలి. వారిలో అర్హులను ఈ నెలాఖరులోపు ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. నవంబర్‌ మొదటి వారం నుంచే ఈ పథకం కింద లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. అంతకుముందు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 5 సంవత్సరాల లోపు రుణం పొందిన వారు అనర్హులు. ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌ 2020-21 ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారు, రిజిస్టర్‌ చేసుకోని కొత్తవారు కూడా అర్హులుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా పాడి పశువులు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా పాలను విజయ డెయిరీ వారికే విక్రయించాలి. తద్వారా రుణం తిరిగి చెల్లించేందుకు సౌలభ్యం పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లోని మిగతా గ్రామాల్లోనూ విడుతలవారీగా పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. దీంతో దళితులు ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడంతోపాటు పాల ఉత్పత్తి పెరుగడానికి ఎంతో దోహదం చేస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement