
వికారాబాద్, ఆగస్టు 19 : పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు కేసులకు సంబంధించిన సలహాలు, సూచనలు అందజేశారు. పోలీస్ స్టేషన్లలో అందరూ 5ఎస్ పద్ధతిని పాటించాలని తెలిపారు. వర్టికల్స్ నిర్వహణలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డయల్ 100 కాల్స్‌పై ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, ఫిర్యాదులపై వెంటనే స్పందించి పోలీస్ శాఖపై వారికి నమ్మకం కలిగించి, పోలీస్ శాఖ తమ వెంట ఉంది అనే ధైర్యాన్ని నింపాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పూర్తి చేసి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు తమ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పురోగతి సాధించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలని తెలిపారు. ఈ పెట్టి కేసులు, ఈ చలాన్లపై దృష్టి సారించాలని, ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు కళాజాత బృందంతో షీ టీమ్‌ల ద్వారా డయల్ 100, మహిళలపై జరిగే నేరాల గురించి అవగాహన, మూఢనమ్మకాలు, రైతు ఆత్మహత్యలు తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ.రషీద్, వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.