
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వికారాబాద్ జిల్లాకు వరప్రదాయిని కానున్నది. ప్రాజెక్టు పనులు పూర్తయితే జిల్లాలోని 3,41,952 ఎకరాలకు సాగునీరు అందనున్నది. రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందనుండడంతో జిల్లా సస్యశ్యామలం కానున్నది. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. వికారాబాద్ జిల్లాలో ప్రాజెక్టు కింద ప్రధాన కాల్వకు 1878 హెక్టార్లు, బ్రాంచ్‌లు, డిస్ట్రిబ్యూటరీల కోసం 2100 హెక్టార్ల భూమి అవసరమున్నది. ఇందులో భాగంగా పరిగిలోని బృందావన్ గార్డెన్లో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, అదనపు కలెక్టర్, నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రెండేండ్లలో ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసి సాగునీటిని అందించాలన్నదే సర్కార్ సదుద్దేశం.
పరిగి, ఆగస్టు 9: జిల్లాకు వరప్రదాయినిగా నిలువనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిలో పనులు చేపట్టి, సాగునీటిని అందించనున్నట్లు ఇటీవల సీఎం ప్రకటించారు. దీంతో వికారాబాద్ జిల్లాలో త్వరలోనే పనులు చేపట్టేందుకు వీలుగా అన్ని అనుమతులు పొందడానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. మంగళవారం పరిగిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లా వ్యాప్తంగా 3,41,952 ఎకరాలకు సాగునీరు అందనున్నది. తద్వారా 417 గ్రామాల్లోని భూమికి సాగు నీటిని అందించేందుకు సర్కారు కృషి చేస్తున్నది. బొంరాస్‌పేట్ మండలంలోని 25 గ్రామాల్లో 30,587 ఎకరాలు, కొడంగల్‌లో 13 పల్లెల్లో 21,524 ఎకరాలు, దౌల్తాబాద్‌లో 16 గ్రామాల్లో 11,640 ఎకరాలు, దోమలో 26 పల్లెల్లో 16,643 ఎకరాలు, కులకచర్లలో 13 గ్రామాల్లో 9,005 ఎకరాలు, పరిగిలో 29 పల్లెల్లో 20,137 ఎకరాలు, పూడూరులో 23 గ్రామాల్లో 17,095 ఎకరాలు, ధారూర్‌లో 34 పల్లెల్లో 24,834 ఎకరాలు, కోట్‌పల్లిలో 18 గ్రామాల్లో 14,211 ఎకరాలు, బంట్వారంలో 10 పల్లెల్లో 6,177 ఎకరాలు, వికారాబాద్‌లో 31 గ్రామాల్లో 16,656 ఎకరాలు, మోమిన్‌పేట్‌లో 21 గ్రామాల్లో 20,851 ఎకరాలు, మర్పల్లిలో 25 గ్రామాల్లో 16,468 ఎకరాలు, బషీరాబాద్‌లో 30 గ్రామాల్లో 34,669 ఎకరాలు, పెద్దేముల్లో 17 గ్రామాల్లో 12,534 ఎకరాలు, యాలాల్లో 32 గ్రామాల్లో 26,432 ఎకరాలు, తాండూరులో 34 గ్రామాల్లో 24,837 ఎకరాలు, నవాబుపేటలో 20 గ్రామాల్లో 17,652 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది.
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంతో జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు రెండు పంటలు సాగు చేసే అవకాశం కలుగుతుంది. మరోవైపు భూగర్భ జలాలు కూడా భారీగా వృద్ధి చెందుతాయి. వ్యవసాయంతోపాటు ఇతర రంగాలు మరింత అభివృద్ధి సాధించేందుకు ఈ ఎత్తిపోతల పథకం ఎంతో దోహదం చేస్తుంది. రాబోయే రెండేండ్లలో ఈ ప్రాంతానికి సాగు నీరు అందించాలన్నది సర్కారు ప్రధాన ఉద్దేశంగా తెలుస్తున్నది. జిల్లా పరిధిలో ఈ పథకం కింద కాల్వల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కూడా చేపట్టనున్నారు. జిల్లాలో ప్రధాన కాల్వ కోసం 1878 హెక్టార్లు, బ్రాంచ్‌లు, డిస్ట్రిబ్యూటరీల కోసం 2100 హెక్టార్ల భూమి సేకరించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేయడంతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పర్యావరణ అనుమతుల కోసం అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పరిగిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు. స్థానిక బృందావన్ గార్డెన్లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు స్థానికులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలుపాలి. కలెక్టర్, అదనపు కలెక్టర్, నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తారు.