
తాండూరు, ఆగస్టు 8: తెలంగాణ సర్కార్ చేయూత.. ప్రజాప్రతినిధుల సహకారం.. ప్రజల ఐక్యత యాలాల మండలం అగ్గనూరు గ్రామం రూపురేఖలను మార్చేశాయి. పల్లె ప్రగతి నిధులతో ఊరంతా పరిశుభ్రంగా మారింది. అద్దాల్లాంటి సీసీ రోడ్లు, రాత్రి వేళలో జిగేల్మనే లైట్లు, ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు గ్రామంలోకి సాదర స్వాగతం పలుకుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదం పంచే చెట్లు, ప్రకృతి వనం, చివరి మజిలీ ఇబ్బందులను తప్పించేందుకు వైకుంఠధామం, చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు, తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు కంపోస్టు షెడ్డు, రైతులకు పంటసాగుపై సూచనలు, సలహాలు అందించేందుకు రైతు వేదిక ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చాయి.
పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామస్తుల్లో చైతన్యం తెచ్చింది. మా ఊరు బాగుండాలనే సంకల్పంతో స్వచ్ఛందగా ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు జనం. దీంతో అగ్గనూరు పంచాయతీ అభివృద్ధి, ఆదర్శానికి నిదర్శనంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తుండడంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది. పల్లె ప్రగతిలో వైకుంఠధామం, ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డు, రైతు వేదిక, ప్రత్యేక నిధులతో కల్వర్టులు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలతో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయి.
పల్లె ప్రగతిలో భాగంగా రూ.12.40 లక్షలతో వైకుంఠధామం, రూ.9.30 లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్, రూ.2.40 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డు, రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ.24 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, రూ.3 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2 లక్షలతో నర్సరీతో పాటు మరో రూ.45.80 లక్షలతో పొలాలకు, వీధుల్లో మట్టి రోడ్లు తదితర పనులు నిర్వహించారు.
అగ్గనూరులో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. పల్లె ప్రకృతి వనంతో పాటు హరిత హారంలో భాగంగా గ్రామంలో నాటిని మొక్కలు చెట్లుగా మారి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాయి. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ప్రజలను ఆకర్శిస్తూ, పచ్చని అందాలతో గ్రామంలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన నిర్మించిన రైతు వేదిక అందరిని ఆకట్టుకుంటున్నది. వ్యవసాయం విధివిదానాలతో పాటు నిజమైన ఎద్దుల్లా ఏర్పాటు చేసిన నిర్మాణాలు చూపరులను అబ్బరపరుస్తున్నాయి.
ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేని మా ఊరు ఇప్పుడు చాలా మంచిగైంది. యాడకూసున్న సంతోషంగా ఉంది. ఎమన్న ఇబ్బంది ఉంటే అడగంగానే మంచిగా చేస్తుండ్రు. తాగనీకి, ఇతర పనులకు నీళ్లు రోజూ వస్తున్నవి. సీఎం కేసీఆర్ పుణ్యాన రోడ్లు బాగయినవి. పింఛను, రేషన్ కూడా సక్కగ వస్తున్నయి. రోజూ పొద్దుగల ట్రాక్టర్ చెత్త తీసుకుపోతున్నది.
పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజ లు ఉత్సహంగా పాల్గొంటున్నా రు. అందరి సమన్వయంతో గ్రా మాభివృద్ధి వేగంగా జరుగుతున్నది. ప్రభుత్వం సూచించిన పను లు పూర్తి చేస్తున్నాం. పల్లె ప్రగతి నిధులతో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. పచ్చదనం, పరిసరాల శుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం.
మూడేండ్లలో చేసిన అభివృద్ధి పనులతో మా ఊళ్లో చాలా అభివృద్ధి జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యేక ప్రణాళికతో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నాం. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టు యార్డు, డంపింగ్యార్డు, నర్సరీ, కల్వర్టులు, మురుగు కాల్వలతో పాటు ప్రత్యేక నిధులతో రైతు వేదిక నిర్మించాం. దశలవారీగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం.