
సాగు పనులు మొదలుకుని.. పంట ధాన్యం కొనుగోలు వరకు తెలంగాణ సర్కార్ అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. పెట్టుబడి సాయం అందించడంతో పాటు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. ఈసారి కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో పాటు బోరుబావుల్లోనూ నీటిమట్టం పెరిగింది. దీంతో వికారాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 5,88,475 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అన్నదాతలు ఇబ్బంది పడకుండా జిల్లాలో 74,683 మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచారు. ఒక్కో రైతుకు అవసరమైన మేరకు ఎరువులను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైతన్నల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిగి, ఆగస్టు 8: వికారాబాద్ జిల్లాలో వానకాలంలో సాగు చేసిన పంటలకు సరిపడా సరఫరా చేసేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇచ్చేందుకు వ్యవసాయాధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి అన్ని పంటలు కలిపి సుమారు 5,88,475 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ఇప్పటివరకు 5,00,483 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వరి నాట్లు కొనసాగుతున్నందున అదనంగా మరో 50వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగనున్నది. జిల్లావ్యాప్తంగా వానకాలానికి 74,683 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతినెలా ఎంత అవసరమనేది ప్రతిపాదనల ఆధారంగా ఎప్పటికపుడు జిల్లాకు ఎరువులు చేరుకుంటున్నాయి.
వానకాలంలో జిల్లావ్యాప్తంగా సాగు చేసే పంటలకు సరిపడా ఎరువులు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు 74,683 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో యూరియా 28,867 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,360 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 6,206 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 21,899 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,351 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదించారు. ఏ నెలలో ఏయే ఎరువులు, ఎంత మోతాదులో అవసరమనే ప్రతిపాదనల ఆధారంగా ఎరువులు సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఎక్కడా ఎరువుల కొరత రాకుండా ముందస్తుగా బఫర్ స్టాకులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని సొసైటీల్లో 2,161 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 4,323 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్‌లో 6,899 మెట్రిక్ టన్నుల ఎరువులు స్టాకుగా ఉన్నాయి.
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సాగు చేసిన పంటలకు తోడుగా వరి నాట్లు కొనసాగుతుండడంతో పంటల సాగు విస్తీర్ణం పెరగనున్నది. ఈసారి వానకాలంలో అన్ని పంటలు కలిపి జిల్లాలో 5,88,475 ఎకరాల్లో సాగు చేయవచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 5,00,483 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో పత్తి 1,98,087 ఎకరాలు, మక్క 59,506 ఎకరాలు, జొన్న 5,350 ఎకరాలు, కందులు 1,62,792 ఎకరాలు, వరి 32,381 ఎకరాలు, పెసర 24,071 ఎకరాలు, మినుములు 10,145 ఎకరాలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈసారి సుమారు 70వేల ఎకరాల్లో వరి సాగు కావచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. విత్తనాలు మొదలుకొని ఎరువులు సైతం అందుబాటులో ఉంచారు. కాగా ఇప్పటివరకు 32,381 ఎకరాల్లో వరి నాట్లు చేపట్టారు. ఆయా డివిజన్ల వారిగా పరిశీలిస్తే కొడంగల్ డివిజన్లో 20,071ల్లో ఇప్పటివరకు 7,887 ఎకరాలు, పరిగి డివిజన్లో 27,185ల్లో 13,121 ఎకరాలు, తాండూరు డివిజన్లో 17,643ల్లో 10,399 ఎకరాలు, వికారాబాద్ డివిజన్లో 5,028 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా 974 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి.
జిల్లాలోని పరిగి, కొడంగల్ డివిజన్లలోనే అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వానకాలం ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరింది. బోర్లలోనూ నీటి మట్టం పెరిగింది. దీంతో ఈసారి వానకాలంలో సుమారు 80వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వానకాలంలో సాగు చేస్తున్న పంటలకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. 74,683 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. పంటలకు ఆయా నెలల్లో ఎంతమేరకు ఎరువులు అవసరమనేది చెప్పాం. అందుకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేస్తారు. పుష్కలంగా వర్షాలు కురియడంతో ఈసారి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనున్నది. సుమారు 80వేల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.