పరిగి, అక్టోబర్7: వికారాబాద్ జిల్లా పరిధిలో ఆలుగడ్డ సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు మరిం త నాణ్యంగా ఆలుగడ్డ పంట సాగును అధునాతన పద్ధతుల్లో చేపట్టేందుకు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈనెల 9న మద్గుల్చిట్టెంపల్లిలోని డీపీఆర్సీలో సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో గల సెంట్రల్ పొటాటో రీసర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె.పాండే హాజరు కానున్నారు. ఆయనతోపాటు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వినయ్‌సాగర్, డాక్టర్ సంజయ్రావల్, డాక్టర్ దేవేందర్‌కుమార్, డాక్టర్ వెంకటాచలం ప్రిన్సిపల్ సైంటిస్ట్ జేసీఏఆర్, సీపీఆర్‌ఎస్, ఊటీ నుంచి హాజరు కానున్నారు. వారు ఆలుగడ్డ పం ట సాగులో మెలకువలు, చీడపీడల నివారణకు
తీసుకోవాల్సిన చర్యలు, కోత అనంతరం జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని 150మంది రైతులను ఎంపిక చేసి శిక్ష ణ ఇస్తారు. అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ నుంచి మోమిన్‌పేట్ మండలానికి చెందిన 50 మంది, మర్పల్లికి చెందిన 50మంది, వికారాబాద్, కోట్‌పల్లి, ఇతర మండలాల నుంచి 50 మంది ఆలుగడ్డ పంట సాగు చేసే రైతులను ఎం పిక చేశారు. ఈ సదస్సుకు రైతులు హాజరై నూతన సాంకేతిక విధానంలో ఆలుగడ్డ పంట సాగుపై అవగాహన పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి డి.చక్రపాణి కోరారు.
జిల్లాలోని భూములు అనుకూలం..
జిల్లాలోని భూములు ఆలుగడ్డ పంట సాగుకు అత్యంత అనుకూలమైనవని శాస్త్రవేత్తలు గుర్తించారు. వికారాబాద్ జిల్లా రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉండడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్‌లో భాగంగా వికారాబాద్ జిల్లాలో కూరగాయలు సాగుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రీసర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ పాండే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తెలంగాణలో ఈనెల 8, 9 తేదీ ల్లో పర్యటించనుంది. 8న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనుండగా, 9న వికారాబాద్‌లో రైతులకు ఆలుగడ్డ పంట సాగులో నూతన సాంకేతికతతో యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించనుంది. ఇప్పటికే జిల్లాలో ఆలుగడ్డ సాగుకు సంబంధించి అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ గతేడాది నుంచి మేలైన రకం ఆలుగడ్డ విత్తనాలను ఆగ్రా నుంచి తీసుకొచ్చి మార్కెట్ ధర కంటే తక్కువకు తమ సంస్థలోని రైతులకు అందజేస్తున్నది. గతేడాది 880 బస్తాల ఆలుగడ్డ విత్తనాలను ఆగ్రా నుంచి తేచ్చి రైతులకు అందజేశా రు. ఈసారి కూడా 420 బస్తాల ఆలుగడ్డ విత్తనాలను తేగా, శుక్రవారం నుంచి రైతులకు పంపి ణీ చేయనున్నారు. మరో పదిహేను రోజుల తర్వాత మరో 420 బస్తాల ఆలుగడ్డ విత్తనాలను ఆగ్రా నుంచి తెప్పించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు అవసరమైన ఆలుగడ్డలను అత్యధిక శాతం ఇతర రాష్ర్టాల నుం చి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రం లో 6,600 ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగు జరుగుతుండగా, మరో 16వేల ఎకరాల్లో ఆలుగడ్డ విత్తనాలను సాగు చేస్తే హైదరాబాద్ అవసరాలను తీరుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలో అదనంగా 3,800 ఎకరాల్లో ఆలుగడ్డ సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి యా సంగిలో 2వేల ఎకరాల వరకు ఆలుగడ్డ పంట సాగు చేపట్టేలా చూడాలన్నది ఉద్యాన శాఖ అధికారుల ఆలోచన.
అందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రైతులకు ఆలుగడ్డ పంట సాగుపై అవగాహన కల్పించడం ద్వారా సాగు విస్తీర్ణం పెం చొచ్చన్నది ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.