పరిగి, అక్టోబర్ 5 : రైల్వే శాఖ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాను కోరారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల ఎంపీలతో మంగళవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు.
చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ రామయ్యగౌడ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, మోమిన్‌పేట్ మండలంలోని గటవనంపల్లి, మొరంగపల్లి ఆర్‌యూబీలు నిర్మించాలని కోరారు. వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రైల్వే బ్రిడ్జిని మరింత పటిష్టం చేయడంతోపాటు స్టేషన్లో మరో ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పాత తాండూరు, కొత్త తాండూరు మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్లు, తాండూరు రైల్వేస్టేషన్లో రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. నారాయణపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, తాండూరు రైల్వే స్టేషన్‌ను అందంగా తీర్చిదిద్ది ఫౌంటేన్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వీటితోపాటు వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో కోణార్క్, పద్మావతి, గరీబ్థ్,్ర పల్నాడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రజల సౌకర్యం కోసం ఆపాల్సిందిగా ఎంపీ కోరారు. అలాగే ఇతర సమస్యలను జీఎం దృష్టికి తీసుకువెళ్లారు.