సర్కారు పాఠశాలల్లో వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఏఏ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు అవసరమనే అంశంపై పూర్తిస్థాయి వివరాల సేకరణకు పూనుకుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 1,084 పాఠశాలలుండగా వాటిలో జడ్పీ ఉన్నత పాఠశాలలు 170,
ప్రాథమిక పాఠశాలలు 712, 173 యూపీఎస్లు, కేజీబీవీలు 18, మోడల్ స్కూళ్లు 9, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 2 ఉన్నాయి. వాటికి సంబంధించిన సమచారమంతా ప్రభుత్వం సేకరించింది.
ప్రతి పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయన్నది పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు పాఠశాలల వారీగా ఫొటోలతో సహా ప్రభుత్వం సర్వే జరిపించింది. రాష్ట్ర స్థాయిలో ఎస్ఐఎస్(స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) యాప్ ను రూపొందించి, ప్రతి పాఠశాలలోని వసతులకు సంబంధించిన ఫొటోలు తీసి అందులో అప్లోడ్ చేశారు. ప్రతి తరగతి గదికి సంబంధించి నాలుగువైపుల గోడలు, రూఫ్, ఫ్లోరింగ్, తలుపులు ఇలా 8 ఫొటోలు, మరుగుదొడ్లు, తాగునీటివసతి, వంటగది, ప్రహరీ, ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, పాఠశాలలో కరెంటు సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు లాగిన్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఆయా పాఠశాలల్లో ఉన్న ప్రతి వసతికి సంబంధించిన వివరాలు ఫొటోలతో ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేయించారు.
పూర్తి స్థాయిలో వివరాలు..
స్కూల్ ఇన్ఫర్మేషన్ యాప్లో ప్రతి పాఠశాలలోని సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేయడం ద్వారా ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు ఇంకా ఏఏ సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వానికి తెలుస్తున్నది. పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య సైతం ఉన్నతాధికారుల వద్ద ఉంటుంది. తద్వారా ఏ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తారు. రెండేండ్లలో పాఠశాలల రూపురేఖలు పూర్తిస్థాయిలో మార్చేందుకు సంకల్పించిన సర్కారు నిధులను సాధ్యమైనంత త్వరలో కేటాయించి పనులు చేపట్టేలా చర్యలకు సిద్ధ్దమైంది.
పాఠశాలల ఫొటోలు అప్లోడ్ చేశాం..
వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్న1084 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రతి గది ఫొటోను ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేశాం. పాఠశాలల్లో ఉన్నతరగతి గదులు, తాగునీటి వసతి, వంటగది, మరుగుదొడ్లు, ప్రహరీ, ఇతర సదుపాయాలకు సంబంధించి ప్రతి గది గోడలు, రూఫ్, ఫ్లోర్ ఫొటోలు ఎస్ఐఎస్ యాప్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అప్లోడ్ చేశారు. వాటి ఆధారంగా ఏ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో తెలుస్తున్నది. ఏ సదుపాయాలు కల్పించాలన్నది నిర్ణయించి నిధులు కేటాయిస్తారు.