ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. దళిత, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. దీంతో నెల రోజులు సర్వే చేసి మండలాల వారీగా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి సమస్యలపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను అంచనా వేస్తూ ప్రణాళికలను రూపొందించారు. వికారాబాద్ జిల్లాలో 535 గ్రామపంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వికారాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పల్లెలు, పట్టణాల పరిధిలోని దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేయించింది. నెల రోజులుగా జిల్లా యంత్రాంగం ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటికి కావాల్సిన నిధులు, పనులను అంచనాలు తయారు చేశారు. మండలాల వారీగా జిల్లా కలెక్టర్కు నివేదికను అందించారు. అధికారుల సర్వే నివేదిక ఆధారంగా జిల్లాకు వివిధ శాఖల ద్వారా వచ్చే నిధులను వినియోగించనున్నారు. ఆ పనులు చేసే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొదించారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు.. కాలనీలు అభివృద్ధి పరుగులు తీయనున్నాయి.
ఆయా శాఖల ఆధ్వర్యంలో…
ప్రభుత్వం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా ఎస్సీ, ఎస్టీ వాడల్లో అధికారులు సర్వే నిర్వహించి ప్రధాన సమస్యలను గుర్తించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, పీఆర్ఏఈ, మిషన్ భగీరథ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈ, ఇతర శాఖల అధికారులు బృందంగా ఏర్పడి సర్వే పూర్తి చేశారు. ప్రతి కాలని, ఇంటిని పరిశీలించి అవసరమైన వివరాలు సేకరించారు. ఇందులో ప్రధానంగా సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, తదితర అంశాలపై విశ్లేషణ చేశారు. ఏమి మౌలిక సదుపాయాలు ఉన్నాయి..? వాటి అమలుకు ఎంత మేరకు ఖర్చు అవుతున్నది..? అనే అంశాలతో అంచనాలు తయారు చేశారు. జిల్లాలో జరిపిన సర్వే ఆధారంగా నివేదికను రూపొదించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిధులు కేటాయింపులు జరుపుతున్నది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇక అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఆయా శాఖల నిధులతో కలిసి గుర్తించిన ఈ పనులకు పల్లె, పట్టణ ప్రగతి, జడ్పీ, ఎంపీపీ, ఎంపీ ల్యాండ్స్, ఎమ్మెల్యేకు సంబంధించి సీడీపీ నిధులు, మిషన్ భగీరథ నిధులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను వినియోగించి పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించి నివేదికలు పంపారు.
అంచనాలు ఇలా..
జిల్లాలోని 19 మండల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో 535 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎస్సీ 313, ఎస్టీ 111ప్రాంతాలు, ఎస్సీ/ఎస్టీ కలిపి 115 ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. ఎస్సీ జనాభా 1,60,693 ఉండగా, ఎస్టీ జనాభా 87,796 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 374046.8 మీటర్ల మేరకు సీసీ రోడ్లు నిర్మించాలని.. ఇందుకు సంబంధించి రూ.14705 లక్షలు అంచనా వేశారు. 344788.6 మీటర్ల మేర మురుగు కాల్వల నిర్మించాల్సి ఉండగా.. రూ.7430.8లక్షలు అంచనా వేశారు. 3671 కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు రూ.643.29లక్షలు, 11975 మీటర్ల విద్యుత్ ఎల్టీ లైన్ పొడిగించాల్సిందిగా (ఇంటర్మీడియట్ పోల్స్), 73 డ్యామేజ్ పోల్స్ గుర్తించారు. ఓవర్ హెడ్ వెళ్లేవి 33 కేవీ 53, 11కేవీ 360, ట్రాన్స్ఫార్మార్లు 60 ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు. 1194 నీటి పైపుల లీకేజీలు గుర్తించారు. 5511 కొత్తగా నల్లాలు బిగించాల్సి ఉందని రూపొందించారు.
సర్వే పూర్తి నివేదిక అందించాం
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సర్వే పూర్తి చేశాం. కాలనీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అంచనాలతో కూడిన ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాం. 535 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎస్సీ 313, ఎస్టీ 111ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ కలిపి 115 ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించాం.
-రిజ్వానా, జిల్లా పంచాయతీ అధికారి