
డీసీసీబీ నుంచి పాడి పరిశ్రమకు ప్రోత్సాహం
మహిళా సంఘాల్లోని ఐదుగురి సభ్యులతో ‘జేఎల్‌జీ’ గ్రూపు ఏర్పాటు
నాబార్డు రుణాలు అందించేలా చర్యలు
మొదటగా రూ.25 కోట్ల రుణాలు వచ్చేలా కృషి
పైలట్ ప్రాజెక్టుగా కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని 14 గ్రామాలు
సత్ఫలితాలిస్తే మరో రూ.100 కోట్లు వెచ్చించేలా ప్రణాళిక
అర్హులను గుర్తిస్తున్న హెల్ప్ స్వచ్ఛంద సంస్థ
పాడి పరిశ్రమ అభివృద్ధికి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి కృషి
కులకచర్ల, సెప్టెంబర్ 3 : పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. డీసీసీబీ ఆధ్వర్యంలో నాబార్డు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుని, మహిళా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిని పెంచి మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నది. పట్టణప్రాంతాలకు పాలను తీసుకొచ్చి విక్రయించి ఆదాయం పొందేలా సహకారాన్ని అందించనున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల సభ్యులకు డీసీసీబీ, పీఏసీఎస్ నుంచి రుణాలు వచ్చేలా కృషి చేస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా కులకచర్ల, చౌడాపూర్ మండలాలు….
పాడి పరిశ్రమ అభివృద్ధికి పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని కులకచర్ల, చౌడాపూర్ మండలాలను డీసీసీబీ ఎంపిక చేసింది. ముందుగా 14 గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కులకచర్ల మండలంలోని కులకచర్ల, తిర్మలాపూర్, అంతారం, ఇప్పాయిపల్లి, రాంపూర్, రాంరెడ్డిపల్లి, కామునిపల్లి, పీరంపల్లి, బొంరెడ్డిపల్లి, పుట్టపహాడ్ గ్రామాలను ఎంపిక చేయగా, చౌడాపూర్ మండలంలో మందిపల్, వీరాపూర్, మల్కాపూర్, పుర్సంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు.
జేఎల్‌జీ గ్రూపుల తయారు..
హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జేఎల్‌జీ(జాయింట్ లయాబులిటీ) గ్రూపులను అధికారులు ఎంపిక చేయనున్నారు. గ్రామ మహిళా సంఘాల్లో పశువులు ఉన్న ఐదుగురు సభ్యులను గుర్తించి ఒక గ్రూపుగా ఏర్పాటు చేయనున్నారు. తరువాత డీసీసీబీలో ఖాతా తీసి, ముందుగా 80వేలు, తర్వాత మరో 80వేలు నాబార్డు రుణాన్ని అందించి గేదెలు, ఆవులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రూ.25 కోట్లు..
పాడి పరిశ్రమ అభివృద్ధికి డీసీసీబీ ముందుకొచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతగా రూ.25 కోట్ల నాబార్డు రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నది. పైలట్ ప్రాజెక్టుగా కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని 14 గ్రామాలను ఎంపిక చేసింది. కార్యక్రమం విజయవంతమైతే రూ.100 కోట్ల వరకు నాబార్డు రుణాలు అందేలా చర్యలు తీసుకోనున్నది.
‘పాడి’ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి డీసీసీబీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని 14 గ్రామాలను ఎంపిక చేశాం. పీఏసీఎస్, డీసీసీబీ నుంచి రుణాలను అందించనున్నాం. మొదటగా రూ.25 కోట్లు వెచ్చించి, సత్ఫలితాలు వస్తే మరో రూ.100 కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం.