
గతేడాదితో పోలిస్తే పెరిగిన నీటి మట్టం
వికారాబాద్ జిల్లాలో ఆశాజనకంగా భూగర్భ జలాలు
14 మండలాల్లో భారీగాపెరిగిన వాటర్ లెవల్స్
బోరుబావుల్లో సమృద్ధిగా నీరు
ఆనందంలో అన్నదాతలు
సమృద్ధిగా వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు పెరిగాయి. ఈ ఏడాది అధిక వర్షాలతో వాగులు పొంగిపొర్లడంతోపాటు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో భూగర్భనీటి మట్టం అమాంతం పెరిగింది. బోరు బావుల్లోనూ సమృద్ధిగా నీరు ఉండటంతో సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్ మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కలిసొచ్చింది. చెరువులు, కుంటల పూడికతీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భజలాలు పెరగడంలో కీలక భూమిక పోషించాయి. గతేడాది ఆగస్టులో జిల్లాలో భూ ఉపరితలం నుంచి 8.72 మీటర్ల లోతులో నీరు ఉండగా, ప్రస్తుతం 8.65 మీటర్లలోనే ఉన్నాయి. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది. 14 మండలాల్లో భారీగా భూగర్భజలాలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
వికారాబాద్, సెప్టెంబర్ 3, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భూగర్భ జలాలు ఆశాజనకంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది వర్షాలు అధికంగా పడటంతో భూగర్భ జలం పైకి వచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న నీటి ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యాంల్లో నీటి మట్టం పెరుగడంతో నీటి లెవల్స్ గణనీయంగా పెరిగాయి. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురియడంతో పాటుగా మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భ జలాలు పెంపొందాయి. జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో నీరుపుష్కలంగా ఉన్నట్లు భూగర్భ జల శాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో 8.72 మీటర్ల లోతులో నీరు ఉండగా, ప్రస్తుతం 8.65 మీటర్లకు చేరాయి. అంటే దాదాపుగా జిల్లాలో 21 ఇంచులు పైకి వచ్చాయి.
పెరిగిన నీటి మట్టం..
జిల్లాలో సరాసరి నీటి పరిస్థితిని అధికార యంత్రాంగం పరిశీలించింది. గతేడాది 8.72 లోతులో నీరు ఉంటే, ఈ ఏడాది ఆగస్టులో 8.65మీటర్లకు చేరాయి. 0.07 స్థాయిలో భూగర్భ జలాలు పెరిగాయి. 39 ప్రాంతాల్లో ఉన్న బోర్ల ద్వారా వాటర్ లెవల్స్ చూశారు. 21 ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ వెల్స్ (బావుల) ద్వారా నీటి లెవల్స్ తీశారు. ఆగస్టు నెలలో 156.03 మి.మీటర్ల సాధారణ వర్షం కురియాల్సి ఉండగా.. 110.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేటలో 5.36, మోమిన్‌పేట మండలం దుర్గంచెరువు 3.75, నవాబ్‌పేట మండలం వట్టిమీనంపల్లి 2.10, వికారాబాద్ 8.50, బంట్వారంలో 4.02, కులకచర్ల 0.45, పూడూరు 6.81, పూడూరు మండలం పెద్దె ఉమ్మంతాల 3.09, బొంరాస్‌పేట మండలం మదనపల్లి 3.60, తాండూరు 3.70, తాండూరు మండలం కోటబాసుపల్లి 1.60, కొడంగల్ 4.40, కొడంగల్ మండలం రుద్రారం 1.51, దౌల్తాబాద్ 5.72 మీటర్ల చొప్పున వాటర్స్ లెవల్స్ భారీ స్థాయిలో పెరిగినట్లు భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు. 14 మండలాల్లో పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మర్పల్లి మండలంలో మే నెలలో 19.94, జూలైలో 17.43 ఉండగా.. ప్రస్తుతం 17.61 మీటర్లకు చేరాయి.
ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో రకంగా..
39 ప్రాంతాల్లో భూగర్భ జలాల వివరాలు సేకరిస్తున్నారు. సరాసరి చూస్తే జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. చెరువులు, చెక్ డ్యాంలు, ఆయా మండలాల్లో భూగర్భ జలాలు దాదాపు పెరిగాయి. కాగ్నా, కాక్రవేణి, జుంటుపల్లి, లక్నాపూర్ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. మరికొన్ని చోట్ల నిర్మించిన చెక్ డ్యాంలు సైతం నిండిపోయాయి. కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, శివసాగర్, కొంపలి చెరువు, నందివాగు, లక్నాపూర్ ప్రాజెక్టు, కాకరవేణి ప్రాజెక్టు, కొడంగల్ పెద్ద చెరువు, హస్నాబాద్, పెద్ద నందిగామ చెరువు, కాగ్నా నది, కాక్రవేణి నది, జుంటుపల్లి, శివసాగర్, శ్రీంరానగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాగ్నా, కాక్రావేణి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదు కాగా.. నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 19 మండలాల్లో 1196 చెరువులు ఉన్నాయి. వీటిలో 25 శాతం 242, 50శాతం 245, 75 శాతం 236, వందశాతం 319, 154 చెరువులు అలుగు పోస్తున్నాయి. అలాగే జిల్లాలోని జంటుపల్లి, కాగ్నా, కోట్‌పల్లి, సర్పాన్‌పల్లి, శివసాగర్ తదితర చెరువులు, ప్రాజెక్టులు అలుగు పోస్తున్నాయి.
సాగునీటి వనరులు..
జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యాంలతో పాటు బోరు, బావులపై ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి త్రీఫేజ్ కనెక్షన్లు 52,779 ఉండగా, అలాగే 100 ఓపెన్ వెల్స్ ఉన్నాయి. చేతి పంపులు తొలగించి (సింగిల్‌ఫేజ్ మోటర్ల) ద్వారా 29,098 గ్రామాల అవసరాలకు వాడుకుంటున్నారు. మిన్కాకతీయ తో పాటు హరితహారం, చెక్ డ్యాంల నిర్మాణం, ఇంకుడు గుంతలు, పర్క్‌లేషన్ ట్యాంకులు నిర్మించడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయడంతో జిల్లాలో కేవలం వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ నీటి వినియోగించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.
వాటర్ లెవల్స్ భారీగా పెరిగాయి
ప్రస్తుతానికి జిల్లాలోని 14 మండలాల్లో వాటర్ లెవల్స్ పెరిగాయి. వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం. రుద్రారంలో 5 మీటర్ల లోతులోనే వాటర్ ఉంది. మిగతా ప్రాంతాల్లో భూగర్భ జలం అధికంగా ఉంది. గతేడాది ఆగస్టులో 8.72 మీటర్ల లోతులో నీరు ఉండగా, ప్రస్తుతం 8.65 మీటర్లకు చేరాయి. 39 ప్రాంతాల్లో ఉన్న బోర్ల ద్వారా వాటర్ లెవల్స్ చూశాం. 21 ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ వెల్స్ (బావుల) ద్వారా నీటి లెవల్స్ తీశాం.
-డాక్టర్ దీపారెడ్డి, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి