బొంరాస్పేట, అక్టోబర్1: సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని దర్శించుకోవాలంటే చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో లోపలికి వెళ్తాం. కానీ పరమేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే పాక్కుంటూ వెళ్లాలి. ఇది వికారాబాద్ జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పరమేశ్వరుని దేవాలయం ప్రత్యేకత. పెద్ద రాతిగుండు కింద ఆ స్వామి లింగమూర్తి రూపంలో స్వయంభుగా వెలిశాడు. చాలా ఏండ్ల కిందట రెండు పెద్ద రాళ్ల మధ్యలో లింగమూర్తి ఉండేది. భూమికి రాతిగుండుకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో పాక్కుంటూ వెళ్లడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కాలక్రమంలో లింగమూర్తిపై ఉన్న రాతి గుండు కరుగుతూ గ్యాప్ పెరుగుతున్నది. ఇది పరమేశ్వరస్వామి మహిమే అని భక్తులు నమ్ముతున్నారు.
ఎత్తైన గుట్టపై వెలిసిన లింగమూర్తి
బొంరాస్పేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో 163వ నంబరు హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారికి పక్కన కిలో మీటరు దూరంలో ఎత్తైన గుట్టపైన పరమేశ్వర దేవాలయం ఉంది. పూర్వకాలంలో ఇక్కడ పెద్ద రాతిగుండు కింద స్వయంభుగా లింగమూర్తి రూపంలో పరమేశ్వరుడు వెలిశాడని పెద్దలు చెబుతారు. అప్పట్లో భక్తులు పూజలు చేయడానికి వెళితే లింగమూర్తిని రాతిగుండు అతుక్కుని ఉండేదని చెబుతారు. రానురాను రాతిగుండు కరిగి భక్తులు పూజలు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఏటా రాతిగుండు కొద్దికొద్దిగా కరుగుతున్నదని భక్తులు విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు భక్తులు పూజలు చేయడానికి బోర్లా పడుకుని పాక్కుంటూ వెళితే, గుండు కరగడం వల్ల ప్రస్తుతం కొద్దిగా వంగి వెళ్లి పూజలు చేస్తున్నారు.
1995లో దేవాలయ నిర్మాణం
దాతల సహకారంతో 1995లో పరమేశ్వర దేవాలయం నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోనే ఆంజేయస్వామి గుడి ఉంది. తరువాత ఆలయ ప్రాంగణంలో సాయిబాబా, భ్రమరాంబ అమ్మవారి దేవాలయాలు నిర్మించారు. నవగ్రహాలు, ధ్వజ స్తంభం ప్రతిష్ఠించారు. భక్తులకు మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించారు. జాతీయ రహదారి నుంచి దేవాలయం వరకు రోడ్డు నిర్మించారు. ప్రతి ఏటా మహా శివరాత్రికి భక్తులు ఉపవాస దీక్షలతో వచ్చి అభిషేకాలు చేస్తారు. శ్రావణమాసంలో సోమ వారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కార్తీక మాసంలో కూడా భక్తులు వచ్చి పూజలు చేస్తారు. ఏటా ఉగాది తరువాత వచ్చే పౌర్ణమినాడు పరమేశ్వరుని జాతర నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దేవాలయంలో 60 నుంచి 70 వరకు వివాహాలు జరుగుతాయి.
ఆహ్లాదమైన వాతావరణం
పరమేశ్వర దేవాలయం ఎత్తైన గుట్టపైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు, కుంటలు కనువిందు చేస్తాయి. పూర్వకాలంలో ఈ గుట్టపైన మునులు తపస్సు చేసినట్లుగా చెబుతారు. జాతీయ రహదారి నుంచి దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మించి, దేవాలయ ప్రాంగణంలోని కమ్యూనిటీ భవనాన్ని పూర్తి చేస్తే ఏటా వివాహాలు జరుపుకొనే వారికి వసతి సౌకర్యం కలుగుతుందని భక్తులు కోరుతున్నారు.
స్వామి దర్శనం సులువు అవుతుంది
30 ఏండ్ల కిందట నుంచి దేవాలయాన్ని చూస్తున్నాను. అప్పట్లో రాతి గుండు కింద ఉన్న లింగమూర్తిని దర్శించుకుని పూజలు చేయడానికి వీలు ఉండేది కాదు. రానురాను రాతి గుండు కరుగుతున్నది. ఇప్పుడు సులభంగా అభిషేకం, పూజలు చేస్తున్నాం. రాతి గుండు కరగడం స్వామి మహిమగానే చెప్పొచ్చు.