
ధారూరు, ఆగస్టు 31 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో ధారూరు స్టేషన్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. రెండేండ్లలోనే ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు అధికారుల కృషితో ప్రగతి పరుగులు తీస్తున్నది. గ్రామంలో విస్తృతంగా అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టడంతో ధారూరు స్టేషన్కు కొత్తరూపు సంతరించుకున్నది. రోడ్డుకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. గ్రామంలోని వీధులు శుభ్రంగా కనిపిస్తున్నాయి. సీసీ రోడ్లు, ప్రతి ఇంటి ఎదుట పచ్చని చెట్టు, రాత్రి వేళల్లో కాంతులు విరాజిల్లుతున్న వీధిలైట్లతో పల్లెకు నూతనశోభను అందిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనం, గ్రామ నర్సరీ పచ్చదనంతో అందంగా కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్, ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టారు. మిషన్భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నారు.
శుభ్రతకు ప్రాధాన్యం
గ్రామంలో 30రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతిలో భాగంగా పురాతన ఇండ్లు, పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన కలుపు మొక్కలు, ముండ్ల కంపను తొలగించి శుభ్రం చేశారు.
స్వచ్ఛ వీధులు
పల్లె ప్రగతిలో భాగంగా పల్లె పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను కొనుగోలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ఇంటింటికీ తిరుగుతూ తడి,పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటి కోసం ట్యాంక్ ఏర్పాటు చేసి నీళ్లను సరఫరా చేస్తున్నారు.
ఆకట్టుకునే నర్సరీ..
పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలోని నర్సరీలో 11వేలు మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వ, ఖాళీ స్థలాలు, దేవాలయాలు, పాఠశాల ఆవరణ, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు.
పచ్చ అందాలతో పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రకృతి వనంతో గ్రామంలో పచ్చదనం ఏర్పడింది. ప్రతి పల్లెలో ప్రకృతి వనం ఏర్పాటు చేసి వందల సంఖ్యలో మొక్కలు నాటి పెంచుతున్నారు. ప్రకృతి వనంలో కొబ్బరి, అశోక, అల్లనేరేడు, చైనా బాదం, తదితర మొక్కలు నాటి వాటిని కాపాడుతున్నారు.
ప్రజల సహకారాలతో గ్రామాభివృద్ధి
గ్రామంలో ప్రతి ఒక్కరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరి కృషి ఉంది. వైకుంఠధామం, కంపోస్టుషెడ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నాం. ఆదర్శ గ్రామంగా మార్చేందుకు మరింత కృషి చేస్తాం.
గ్రామ రూపురేఖలు మారాయి
పల్లె ప్రగతి కార్యక్రమాలతో మా పల్లె రూపురేఖలు మారాయి. పల్లె ప్రగతి, 30రోజుల ప్రణాళికతో గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నాం.
గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులు
వైకుంఠధామం : 11.00 లక్షలు
కంపోస్టు షెడ్ : 2.14 లక్షలు
సీసీ రోడ్డు నిర్మాణానికి : 9.29లక్షలు
మురుగు కాల్వల కోసం : 3.89లక్షలు
రైతు కల్లాలు : లక్ష
పల్లె ప్రకృతి వనం : 24 లక్షలు
ఇంకుడు గుంతలు : 3.60 లక్షలు
వ్యక్తిగత మరుగుదొడ్లు : 14.4లక్షలు
గ్రామ నర్సరీ : 71వేలు