దోమ, అక్టోబర్ 24 : పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులతో బాసుపల్లి గ్రామం రూపు రేఖలు మారిపోయాయి. బాసుపల్లిలో 320 గడపలు ఉండగా, 1245 జనాభా, 972 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతి కంటే ముందు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేపట్టినప్పటికీ గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. పల్లె ప్రగతిలో భాగంగా బాసుపల్లి గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచని గ్రామం రెండున్నర ఏండ్లలో అభివృద్ధి దిశగా పయనించడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌తో చెత్తను సేకరించి కంపోస్టు షెడ్డుకు తరలించి గ్రామంలో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, మురుగు కాలువలు, తడి, పొడి చెత్త సేకరణతో గ్రామం పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది.
గ్రామాభివృద్దికి చేపట్టిన అభివృద్ధి పనులివే..
పల్లె ప్రగతిలో భాగంగా రెండున్నర ఏండ్లలో 55 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.11 లక్షలతో వైకుంఠధామం, 10 లక్షలతో పంచాయతీ పారిశుధ్యానికి ట్రాక్టర్ కొనుగోలు, 14 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం పనులు కొనసాగుతున్నాయి. 4 లక్షలతో డ్రైనేజీ పనులు చేపట్టగా.. 3 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులను పూర్తి చేసి గ్రామంలో మురుగునీరు నిలువకుండా పరిశుభ్రతకు చర్యలు చేపట్టి పారిశుధ్యానికి పెద్దపీట వేశారు. 2 లక్షలతో గ్రామంలో నందనవనం లాంటి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి 2200 మొక్కలు నాటడంతోపాటు వాకింగ్ ట్రాక్, ప్రజలు సేద తీరేందుకు అనువుగా సిమెంట్‌తో చేసిన బెంచీలను సమకూర్చారు. వనంలో అశోక, కొబ్బరి, జామ, బాదాం, వివిధ రకాల డిజైన్లలో ఉండే ప్రత్యేక ఆకర్షణగల మొక్కలు, మందారం, తెలుపు, ఎరుపు రంగు గన్నేరు మొక్కలు నాటడంతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. హరితహారం కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పల్లె సుందరంగా కనిపిస్తున్నది. మిషన్ భగీరథ తాగు నీరు అందించేందుకు ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేయడంతో తాగు నీటి కోసం క్యూ కట్టే పరిస్థితి నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. ప్రభుత్వం అందించే పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకోవడంతో బాసుపల్లి గ్రామం అభివృద్ధి సాధించగలిగింది.
పల్లె ప్రగతితోనే అభివృద్ధి సాధ్యపడింది : పద్మ, సర్పంచ్
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడంతో గ్రామ ముఖ చిత్రం మారిపోయింది. ప్రభుత్వం నెలనెలా విడుదల చేస్తున్న నిధులతో ప్రతీ రూపాయిని అభివృద్ధి పనులకు వినియోగించి గ్రామాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. దశాబ్దాల తరబడి పరిష్కారం కాని ఎన్నో సమస్యలు పల్లె ప్రగతిలో పరిష్కరించబడ్డాయి. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అవసరాలకు దగ్గ పనులను చేపట్టి అభివృద్ధి సాధించగలిగాం.
అధికారులు, స్థానిక ప్రజల సహకారంతో అభివృద్ధి
అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యపడింది. ప్రజల అవసరాల ప్రాధాన్యతాక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను చేపట్టి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. గ్రామంలో ప్రతి నిత్యం సర్పంచ్‌తో కలిసి పర్యటించి ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వ నిర్దేశానుసారంగా గ్రామంలో పనులను చేపడుతున్నాం.