కడెం ప్రాజెక్టు.. ఆయకట్టు రైతుల వరప్రదాయిని. కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, మంచిర్యాల మండలాల్లోని 65 వేల ఎకరాలకు సాగు నీరందించే కల్పతరువు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద జలాశయంగా రైతాంగం కష్టాలు తీర్చిన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు మరింత ఆయకట్టు పెంచుకోనున్నది. ఇందులో భాగంగా ఏడు చెక్‌డ్యాంల నిర్మాణానికి అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం మొదటి విడుతగా రెండు మంజూరు చేసింది. దీంతో ఒక్కో చెక్‌డ్యాం కింద 300 నుంచి 350 ఎకరాలకు పైగా సాగునీటితో తడవనున్నది. కాగా, రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది.
– కడెం, ఏప్రిల్ 5
1948లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా పనులు ప్రారంభించుకున్న ఈ ప్రాజెక్టు, అప్పటి ఇంజినీర్లు అయ్యంగారు, బాలకృష్ణరావు, గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో 1949లో నిర్మాణం పూర్తి చేసుకుంది. దీనికి కుడి, ఎడమ కాలువలు నిర్మించారు. కుడి కాలువ ద్వారా కడెం మండలంలోని కన్నాపూర్, కొండుకూర్, బెల్లాల్, చిట్యాల్, గ్రామాలకు.., ఎడమ (ప్రధాన) కాలువ ద్వారా కడెం మండలంతో పాటు దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, మంచిర్యాల మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. పూర్తిస్థాయి సామార్థ్యం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రధానంగా దీనిపైనే ఆధారపడి ఉన్న రైతాంగానికి దశాబ్దాలుగా సాగునీటి కష్టాలు తీర్చుతున్నది. వర్షపునీరే దీనికి ప్రధాన ఆధారం. కడెం ఎగువ ప్రాంతంలోని సహ్యాద్రి కొండల నుంచి, వాటి ఎగువనున్న కుంటాల, కుప్టి, గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, బజార్హత్నూర్, బోథ్ మండలాల నుంచి వర్షపునీరు ఇక్కడికి చేరుతుంది. దీని ద్వారా ఆయకట్టు కింది మండలాలకు సాగునీరు అందుతున్నది.
కడెం ఆయకట్టు కింద ఏడు చెక్‌డ్యాంలను నిర్మించి మరింత మంది రైతులకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో అధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో వివిధ ప్రాంతాల రైతులు ఎమ్మెల్యేలు, నీటిపారుదలశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ చొరవ తీసుకున్నారు. కడెం వాగు పలు గ్రామాల మీదుగా గోదావరిలో కలుస్తుంది. అయితే వాగుపై పాండ్వాపూర్, పెద్దబెల్లాల్ గ్రామాల సమీపంలో రెండు చెక్‌డ్యాంలు నిర్మించాలన్న రైతుల డిమాండ్ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే దస్తురాబాద్-జన్నారం మండలాల్లోని ప్రధాన వాగు వద్ద.., బుట్టాపూర్-కలమడుగు ప్రాంతాల మధ్య.., మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్‌పెల్లి, మొర్రిగూడెం, గుడివాగు, రోటిగూడ ప్రాంతాల్లో ఇటీవల సర్వేలు కూడా పూర్తి చేశారు. వాటికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించినట్లు పేర్కొన్నారు. ముందుగా కడెం మండలంలోని పాండ్వాపూర్, పెద్దబెల్లాల్ ప్రాంతాల్లో నిర్మించే చెక్‌డ్యాంలకు ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ అయ్యాయని తెలిపారు. ఇందుకు సంబంధించి నీటిపారుదలశాఖ అధికారులు ఇటీవలే సర్వే పూర్తి చేసి, తుది నివేదికను ప్రభుత్వానికి అందించారు.
చెక్‌డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలతో పాటు, ఆయకట్టూ పెరగనున్నది. ఏడు చెక్‌డ్యాంల పరిధిలో ఒక్కో చెక్‌డ్యాం కింద 300 నుంచి 350 ఎకరాలకుపైగా సాగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సర్వేలో వెల్లడించారు. అయితే కడెం మండలంలోని పాండ్వాపూర్ వద్ద నిర్మించినున్న చెక్‌డ్యాం పరిధిలో పాండ్వాపూర్, కొండుకూర్, గొండుగూడ, లంబాడీతండా, నవాబుపేట, లక్ష్మీపూర్ గ్రామాలకు సాగునీరు అందే అవకాశంతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. పెద్దబెల్లాల్ సమీపంలోని కడెం వాగుపై నిర్మించనున్న చెక్‌డ్యాంతో పెద్దబెల్లాల్, చిన్నబెల్లాల్, కొండుకూర్, మొర్రిగూడెం, ఎస్సీ కాలనీ, అంబారిపేట, దేవునిగూడెం గ్రామాలకు సాగు నీరు అందడంతో పాటు ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. అలాగే దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామ సమీపంలోని వాగు వద్ద నిర్మించనున్న చెక్‌డ్యాం ద్వారా బుట్టాపూర్, చెన్నూర్, మల్లాపూర్, కలమడుగు, మురిమడుగు గ్రామాలకు సాగునీటి లభ్యం జరగనున్నది. అలాగే ఇందన్‌పెల్లి, మొర్రిగూడెం, గుడివాగు, రోటిగూడ ప్రాంతాల్లోని నిర్మించనున్న చెక్‌డ్యాంల పరిధిలోని సమీప గ్రామాల్లో దాదాపు 20 గ్రామాలకు లబ్ధి చేకూరనున్నది. మొత్తం ఏడు చెక్‌డ్యాంల ద్వారా 3,500 ఎకరాల భూమికి సాగునీరు అందనున్నది. అలాగే సమీప గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కడెం జలాశయం పరిధిలో ఏడు చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మొదటి విడుత కింద కడెం మండలంలోని పాండ్వాపూర్, పెద్దబెల్లాల్ ఎంపికకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే దశల వారీగా మిగిలిన వాటికి కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ చెక్‌డ్యాంల నిర్మాణం పూరైయితే రైతులకు మరింత మేలు కలిగే అవకాశం ఉంది.
– రాజశేఖర్, ఈఈ, కడెం ప్రాజెక్టు