ధర్పల్లి/చందూర్/డిచ్పల్లి/జక్రాన్‌పల్లి/వర్ని/రుద్రూర్/ఖలీల్‌వాడి, (మోపాల్)/సిరికొండ, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచడంపై టీఆర్ఎస్, రైతు నాయకులు మండిపడ్డారు. ఆయా గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ సర్కారు, ఆ పార్టీ నాయకుల తీరును ఎండగట్టారు.
రైతులే బుద్ధి చెబుతారు..
ధర్పలిల్లో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రాజ్‌పాల్‌రెడ్డి, సర్పంచ్ పెద్దబాల్‌రాజ్, టీఆర్ఎస్ నాయకుడు నల్ల హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను ప్రవేశపెడుతుంటే, కేంద్ర ప్రభుత్వం అన్నదాతపై భారం మోపుతున్నదని అన్నారు. రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్న బీజేపీకి రైతులపై శ్రద్ధ లేదన్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే ఎరువుల ధరలను తగ్గించాలన్నారు. కర్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ నాయకులకు రైతులు బుద్ధి చెబుతారన్నారు.
పండుగపూట రైతులకు క్షోభ..
చందూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంబర్ సింగ్, సర్పంచ్ సాయారెడ్డి, సత్యనారాయణ, మాధవరెడ్డి, ప్యారం అశోక్, శేఖర్ తదితరులు మాట్లాడారు. పండుగపూట కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులను క్షోభకు గురిచేస్తున్నదని అన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఆందోళన తప్పదు..
పెంచిన యూరియా ధరలను తగ్గించకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని టీఆర్ఎస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. మోసపూరిత హామీతో గెలిచిన ఎంపీ అర్వింద్‌కు జిల్లాలో తిరిగే హక్కు లేదన్నారు.
అన్నదాతల పాలిట శాపం
జక్రాన్‌పల్లిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, ఎంపీపీ హరిత, నాయకులు డీకొండ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ రైతాంగం సాగుచేస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వం.. ఎరువుల ధరలను పెంచి అన్నదాతల పాలిట మరోసారి శాపంగా మారిందన్నారు.
ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి
వర్ని మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లాలి గిరి, వైస్ ఎంపీపీ బాలరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్ తదితరులు మాట్లాడారు. రైతుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
రైతును కన్నీరు పెట్టిస్తున్నారు..
రుద్రూర్లో జడ్పీటీసీ నారోజీ గంగారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, వైస్‌ఎంపీపీ సాయిలు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఖాదర్ మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతులతో కేంద్ర ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచిన ధరలరూపంలో తన్నుకు పోతున్నదని విమర్శించారు.
బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
మోపాల్‌లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీపీ లతా కన్నేరామ్ మాట్లాడారు. ఎరువుల ధరలను పెంచి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఎంపీలు సంజయ్, అర్వింద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంపై పోరాటమే..
సిరికొండలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆకుల తిర్మల్, వైస్ ఎంపీపీ తోట రాజన్న మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తప్పదన్నారు.