కొత్త కోరికలు, కమ్మని భావాలు, సరికొత్త వ్యూహాలకు నాంది.. జీవిత సారం షడ్రుచుల పాయసం, పిండివంటల మాధుర్యంతో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకొనే ఉగాది పండుగకు ఊరూరా సిద్ధమయ్యారు. పంచాంగ శ్రవణంలోని లాభనష్టాలు, మధ్య తరగతి జీవనయానంలో కష్టం, సుఖం, ఆదాయ వ్యయాలకు ప్రతీకగా భావించే పండుగ ఇది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా విచ్చేస్తున్న శుభకృత్ నామ సంవత్సరానికి ప్రజలంతా స్వాగతం పలుకుతున్నారు. ఆలయాల్లో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రజలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ సంవత్సరం మరింత జనరంజకంగా సాగాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం తోడుగా ప్రజలకు అంతా శుభమే జరుగాలని వారు ఆకాంక్షించారు.
ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలతో, పూలతో, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించి షోడశోపచారాలతో పూజించి దీప, ధూప, నైవేద్యాలే కాకుండా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రధానంగా నివేదిస్తుంటారు. అయితే ఉగాది రోజున అభ్యంగన స్నానమాచరించడం ఆరోగ్య ప్రదం. సంప్రదాయ దుస్తులను ధరించి ఉగాది పచ్చడి ఆరగించిన తర్వాత బంధుమిత్రులతో భోజనం చేయడం ఉగాది ప్రత్యేకత.
చతుర్ముఖ బ్రహ్మకు ఒక రోజున సందేహం కలిగిందట. ఏ రోజున ఈ సృష్టిని ప్రారంభిస్తే బాగుంటుందని శ్రీ మహావిష్ణువును అడుగగా.. ప్రజలందరూ ఏ రోజున ఆనందంగా ఉంటారో అటువంటి మంచి రోజును చూసి ప్రారంభించమన్నాడట. అప్పుడు బ్రహ్మ ‘ప్రభవ’ నామ సంవత్సరం ఉత్తరాయణంలో వసంత రుతువున ఉన్న మొదటి మాసం చైత్రంలో సృష్టిని ప్రారంభించాడు. అందుకే ఉగాది చైత్రశుద్ధ పాడ్యమిన వచ్చే పండుగ. ‘ఉగము’ అనగా నక్షత్ర గమనం అని అర్థం. ‘ఉగాది’ నుంచి నక్షత్ర గమనమును లెక్కిస్తారు. ఈ రోజున తలంటు స్నానం చేసి, వేపపువ్వు పచ్చడిని ఈశ్వరుడికి నివేదన చేసి ఆరగించాలి. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలనే ఆంతర్యం ఆ పచ్చడిలో దాగి ఉంది. శిశిరం తర్వాత వచ్చే నెల చైత్రం. పన్నెండు మాసాలలో శిశిరం చివరిది. అది ఆకురాలు కాలం. చైత్రం కొత్త చిగుళ్లు వేసే మాసం. మానవాళి కూడా తమకు జరిగిన మంచిని జ్ఞాపకాలుగా ఉంచుకొని, మిగిలిన సంఘటనలను చెట్లు తమ ఆకులు రాల్చుకున్నట్లుగా దులిపేసుకొని కొత్త ఆశయాలతో , నూతన కాంతులతో చిగురించడమే ‘ఉగాది’. జగత్తును చైతన్యంతో రగుల్కొల్పి మానవ జాతిని నూతన ఆశయాలతో ఉద్దీపింపజేయడమే తెలుగు నూతన సంవత్సర ముఖ్య లక్షణం.
ఆరు రుచులతో చేసేది ఉగాది పచ్చడి. దీనిని దివ్యౌషధమని చెప్పాలి. వేపపువ్వు, చింతపండు గుజ్జు, కొత్త బెల్లం, కొబ్బరి, మామిడి ముక్కలు, చెరుకు రసం, అరటిపండ్లు, ఉప్పు, కారంతో తయారు చేసేదే ఉగాది పచ్చడి. వేపపువ్వులో చేదు క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. కఫ, వాత, పైత్యాలను హరించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది. మామిడికాయ గుండెకు బలాన్నిస్తుంది. కాలేయానికి మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చెరుకు రసం మూత్ర పిండాలకు చాలా మంచిది. అధిక మూత్రాన్ని, వాతాన్ని అరికడుతుంది.
కలియుగ కాలమానానికి కొలమానం ఉగాది ప్రకృతి పరిణామాలకు ప్రతిరూపం ఉగాది షడ్రసోపేతమైన పచ్చడిని అందించేది ఉగాది శరీర అవయవాలకు సప్తధాతువులకు శక్తినిచ్చేది.. ‘తీపి’ఆమ్ల గుణము కలిగి జీర్ణ వ్యవస్థకు, జఠరాగ్నికి బలమునిచ్చేది.. ‘పులుపు’వాత, పిత్త, కఫముల సమతుల్యతకు శరీరంలోని మలినాలను బయటికి నెట్టివేయుటకు నాలుకకు రుచి పుట్టించుటకు.. ‘ఉప్పు’రుచికి, నరాల సత్తువకు, చర్మ సౌందర్యానికి, సహాయపడేది..‘కారం’రుచులు తెలియకుండా చేసేవాటిని, జీర్ణక్రియలకు హాని చేసే మలినాలను బహిర్గతము చేసేది.. ‘చేదు’ శరీరంలోని వేడిని హరిస్తూ వాత, పిత్త, కఫ దోషాలను అణిచివేసేది.. ‘వగరు’ ఈ షడ్రుచులు మనిషి శరీర పోషణకు ఆరోగ్యానికి ఎంత అవసరమో! మానవ జీవన వికాసానికి కష్ట నష్టాలు.. సుఖ సంతోషాలు.. ఒడిదుడుకులు అంతే అవసరమని చెప్పకనే చెప్పును ఉగాది పచ్చడి అందుకే దీనికి ఎంతో విశిష్టత
– జయాకర్ రాపోలు, నల్లగొండ, సెల్ 9963581382
తిథి, వార, నక్షత్రాలతో కూడుకున్న పంచాంగాన్ని వినడం వల్ల ఆ సంవత్సరాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణం తప్పనిసరి ప్రక్రియగా ఉగాది రోజు నిర్వహిస్తారు. సంవత్సరం ముగింపు వరకు జరిగే విశేషాలను బ్రాహ్మణులు వివరిస్తారు.
నల్లగొండ, ఏప్రిల్ 1 : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కరోనా మహమ్మారి పూర్తిగా నశించాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
సూర్యాపేట, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం మరింత జనరంజకంగా సాగాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో పెట్టిస్తున్న పరుగులకు శుభకృత్ తోడవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. నూతన తెలుగు సంవత్సరం శ్రీ శుభకృత్ పేరులోనే శుభం ఉన్నందున రాష్ట్ర ప్రజలకు ఇకపై అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని జరుపుకొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి