పహాడీషరీఫ్ : చెత్త డంపింగ్‌తో జల్పల్లి పెద్ద చెరువుకు పర్యావరణ ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులను కాపాడి వాటికి పూర్వవైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో సుందరీకరణ పనులకోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అందులో భాగంగానే జల్పల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని జల్పల్లి పెద్దచెరువు సుందరీకరణకు ఇటీవల రూ. 9 కోట్లనిధులను కేటాయించింది. త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
ఓ దిక్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మున్సిపాల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి చెరువు అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొస్తుంటే మరో వైపు మున్సిపాలిటీ అధికారులు అందుకు విరుద్ధంగా మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 50 కాలనీలలో సేకరించిన చెత్తను చెరువుకు సమీపంలోనే ఉన్న డంపింగ్‌యార్డ్‌లో పారబోస్తున్నారు. ఈ డంపింగ్ యార్డు నుంచి ఎప్పటికప్పుడు చెత్తను జవహార్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించకపోవడంతో గుట్టలు గుట్టలుగా చెత్త పేర్కొని పోయింది. సేకరించిన చెత్త డంపింగ్‌కు స్థలం సరిపోకపోవడంతో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో, చుట్టుపక్కలా డంపింగ్ చేస్తున్నారు.
మరో వైపు చెత్తకు నిప్పు పెడుతుండడంతో వచ్చేపొగతో సమీపంలో ఉన్న వాది ఏ ముస్తఫా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకుపోతున్న చెత్తను ఎప్పిటికప్పుడు తరలించకుండా ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చెరువుకు కాలుష్య ప్రమాదం పొంచి ఉంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. చెరువు సుందరీకరణ పనులు మొదలు కాకముందే డంపింగ్ యార్డ్ నుంచి చెత్తను తరలిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
చెత్తను తరలించాలి : షేక్ అప్జల్, మాజీ ఎంపీటీసీ జల్పల్లి
చెత్త డంపింగ్‌తో వాది ఏ ముస్తఫా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా డంపింగ్ యార్డు నుంచి చెత్తను తరలించడంలేదు. మరో వైపు చెత్తకు నిప్పు పెట్టడంతో పొగ వ్యాపిస్తుంది. పొగతో అనారోగ్యాల పాలు అవుతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నీటిలో కూడా చెత్తను డంపింగ్ చేస్తున్నారు. వెంటనే చెత్తను ఇక్కడి నుంచి తరలించాలి.
చెత్తను జవహర్‌నగర్ కు తరలిస్తాము: కమిషనర్ జి.పి కుమార్
జీఎచ్ఎంసీ వాహనాలలో మాత్రమే చెత్తను తరలించాలి. గతంలో చెత్తను తరలించడానికి ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించాము. కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్ చెత్తను తీసుకెళ్లడంలేదు. పై అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుని త్వరలోనే చెత్తను తరలించడానికి కృషి చేస్తాను.