రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ బాధ్యత నుంచి మోదీ సర్కారు తప్పుకోవాలని చూస్తే మెడలు వంచి కొనుగోలు చేయిస్తామని హెచ్చరించారు. సూర్యాపేట, పెన్‌పహాడ్, ఆత్మకూర్.ఎస్, చివ్వెంలలో రైతు దీక్షల్లో మంత్రి స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలుకు మొదలుపెట్టిన ఈ ఆందోళన రాష్ట్రంలో మరో ఉద్యమానికి తొలిమెట్టు అని ప్రకటించారు.
చివ్వెంల / పెన్‌పహాడ్ / ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 4 : రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, పెన్‌పహాడ్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో నిర్వహించిన నిరసన దీక్షల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ధాన్యమంతా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసేదాక కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. గతంలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని సీఎం కేసీఆర్ సూచిస్తే, వరి వేయాలని కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో కొనుగోలు చేస్తామని మాయమాటలు చెప్పిన నాయకులు ప్రస్తుతం కనిపించట్లేదని పేర్కొన్నారు. 2014కు ముందు కరెంట్, నీరు, ఎరువుల కోసం మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తే ప్రస్తుతం ధాన్యం కొనాలని ధర్నాలు చేయాల్సిన దుస్థితి బీజేపీ వల్లే దాపురించిందని విమర్శించారు. పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో మిగతా రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా చూపించాల్సిన కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు ధరావత్ కుమారిబాబూనాయక్, నెమ్మాది భిక్షం, మర్ల స్వర్ణలతా చంద్రారెడ్డి, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు మారినేని సుధీర్‌రావు, కొణతం సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు జూలకంటి జీవన్‌రెడ్డి, యుగేంధర్, నర్సింహారావు పాల్గొన్నారు.