రాజన్న సిరిసిల్ల, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి టౌన్: సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంపుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ వైద్యాధికారులను ఆదేశించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్లో గురువారం రాత్రి కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా దవాఖానను సందర్శించారు. గర్భిణులతో మాట్లాడి సేవలందుతున్న తీరును తెలుసుకున్నారు. పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైతే తాత్కాలిక వైద్యులను నియమించుకోవాలన్నారు. ప్రసవాలు చేయించుకున్న మహిళలకు కేసీఆర్ కిట్లు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలు చేయాలని, అవసరమైతే తప్పా ఆపరేషన్లు చేయవద్దన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయాచోట్ల మాట్లాడుతూ 12 వారాల వరకు గర్భిణుల నమోదు 90 శాతం ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో అనీమియా ట్రాకర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు వందకు వంద శాతం టీకాలు వేయాలని ఆదేశించారు. ఆర్బీఎస్కే బృందాలు బాగా పనిచేసేలా పర్యవేక్షించాలని, ఎన్సీడీ స్క్రీనింగ్ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జరగాలన్నారు. టీబీ వ్యాధి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ తరఫున పటిష్ట చర్యలు చేపట్టాలని, హెచ్ఐవీ, లెప్రసీ కేసుల విషయమై నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు చేయాలన్నారు. తెలంగాణ టెలీ కన్సల్టేషన్ సదుపాయాలను విస్తృత పరచాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ఈ-సంజీవని ప్రారంభించాలని కోరారు. ఒక్కో ఏఎన్ఎం నుంచి రోజుకు ఒక కాల్ వస్తుందని, దీనికి మెడికల్ ఆఫీసర్లు అటెండ్ అవ్వాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌లను అభివృద్ధి చేసి, ఏఎన్ఎం రిజిస్టర్లను ఆన్లైన్ చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్లు సుమన్‌మనోహర్‌రావు, శ్రీధర్, స్టేట్ ప్రోగాం ఆఫీసర్లు, జిల్లాల మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. పెద్దపల్లిలో స్టేట్ ప్రోగాం అధికారి డాక్టర్ సూర్యశ్రీ, జిల్లా వైద్యధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీసీహెచ్ డాక్టర్ మందల వాసుదేవా రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ రేగళ్ల రమాకాంత్ ఉన్నారు.