భద్రాచలం/ పర్ణశాల, జనవరి 12: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం దివ్యక్షేత్రంలో బుధవారం సాయంత్రం రాములోరి తెప్పోత్సవం సంప్రదాయ బద్ధంగా సాగింది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన ఉత్సవాల్లో ఒకటైన తెప్పోత్సవాన్ని ఈ ఏడాది ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంతరంగికంగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానమైన హంస వాహనంపై గోదావరి అలలపై ఎంతో వైభవంగా నిర్వహించాల్సిన ఈ వేడుకను రామాలయం ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులకు అనుమతి లేకపోవడంతో కొద్దిమంది అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ సీతా లక్ష్మణ సమేతుడైన జగదభిరాముడు తెప్పోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమర్చిన హంస వాహనంపై ఆసీనులై ప్రత్యేక పూజలందుకున్నారు. దేవస్థానంలో ఉదయం తిరుమంగైళ్వార్ పరమపదోత్సవం నిర్వహించారు. దేవస్థానం ఈవో శివాజీ.. స్వామివారికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం మంగళహారతి ఇచ్చి చక్కెర పొంగలి నివేదన చేశారు. భద్రాచలం ఇన్చార్జి కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, వేద పండితులు లింగాల ప్రసాద్‌శర్మ, సన్యాసి శర్మ పాల్గొన్నారు.
పర్ణశాలలో..
ముక్కోటి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలోనూ నీలిమేఘశ్యాముడైన రాముడు.. శాస్ర్తోక్తంగా పూజలందుకున్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా భక్తులను అనుమతించలేదు. ఆలయంలోనే ఆంతరంగికంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ కిశోర్, ఏఈవో భవానీ రామకృష్ణ, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ వరలక్ష్మి, కార్యదర్శి ప్రసాదరెడ్డి, ఆలయ అధికారి ప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు.