
మిర్యాలగూడ, జనవరి12 : రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ముందుగా పట్టణంలో వందలాది ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, కోలాట బృందాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్‌పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. రైతులు భారీగా తరలిరావటంతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా సంబురాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు సాయం రూ.50 వేల కోట్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి లింగయ్యయాదవ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, సిద్ధార్థ క్షీరాభిషేకం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కృష్ణా జలాలను విచ్చలవిడిగా ఆంధ్రాకు తరలించి జలదోపిడీకి పాల్పడి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గత ఏడేండ్లుగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు రెండు పంటలకు నీళ్లిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల పరిధిలో 2.50 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. రూ.500 కోట్లతో దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలల్లో 25 వేల ఎకరాలకు నీరు అందించేందుకు 3 లిఫ్టులు మంజూరు చేయించారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అలీబాబా అరడజను దొంగల టీమ్‌లా తయారైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశమంతా రాష్ట్రం వైపే దృష్టి సారించేలా ఉన్నాయని అన్నారు. రైతులంతా కేసీఆర్‌కు అండగా నిలుస్తున్నారని అన్నారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు దొంగలుగా మారి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు.
రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్
: ఎమ్మెల్సీ కోటిరెడ్డి
ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా మారి వ్యవసాయరంగాన్ని పండుగలా మార్చారని పేర్కొన్నారు. పంట పెట్టుబడికి ఏటా ఎకరాకు రూ.10 వేలు, రైతుబీమా, 24 గంటల కరెంటు ఇచ్చి అన్నదాతలకు ఆసరాగా నిలిచిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రామచంద్రునాయక్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళాహనుమంతరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చిట్టిబాబునాయక్, అన్నభీమోజు నాగార్జునాచారి, వెల్దండ లింగారెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, షోయబ్, మట్టపల్లి సైదులు పాల్గొన్నారు.