ఓవైపు అన్నదాతల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే.. కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే నల్లచట్టాలు తెచ్చి రైతుల నిరసనతో వెనక్కి తగ్గిన కేంద్రం.. కర్షక వ్యతిరేక విధానాలను మాత్రం ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించడం లేదు. పెంచిన పెట్రో ధరలతో సాగుఖర్చులు గణనీయంగా పెరిగిపోగా, తాజాగా ఎరువుల ధరలను పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వానకాలం సీజన్లోనే ఎడాపెడా పెంచిన ధరలతో రైతులు కుదేలయ్యారు. తాజాగా యాసంగికి ముందు మరోమారు ధరల పెంపు నిర్ణయంతో కర్షకులపై మోయలేని భారం పడనున్నది. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కేంద్రం.. ఆ పని చేయకపోగా రైతు జేబుకు కన్నం వేసేందుకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్, జనవరి 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. ఏడేండ్ల కాలంలో కర్షకుల మేలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రకాల పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు. రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయం, రైతు మరణిస్తే కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, ఉచితంగా నిరంతర కరెంట్, పొలాలకు సాగు నీరును రాష్ట్ర సర్కారు అందిస్తోంది. చేతి నిండా పని దొరకడంతో రైతులంతా సాగు పనుల్లో బిజీగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అన్నదాతలకు మేలు చేయకపోగా పదే పదే కీడును తలపెడుతున్నది. ఇంధన ధరలతో ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి రైతాంగం లబోదిబోమంటున్నది. కేంద్రం అవలంబిస్తోన్న తీరుపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇంధన ధరల పెంపుతో కుదేలవుతున్న రైతన్నలకు యాసంగి సీజన్ మొదలవ్వడానికి ముందే కేంద్రం మరోసారి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. ఎరువుల ధరలను అమాంతం పెంచి కర్షకులకు కన్నీరు తెప్పిస్తోంది. ఆరు నెలలు తిరగకముందే మరోమారు ఎరువుల ధరలను పెంచడం తో బీజేపీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
మోదీ సర్కార్ కర్కషత్వం…
అన్నదాతలపై మరోసారి ఎరువుల భారం పడనున్నది. వీటి ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులను ఆందోళనకు గురి చే స్తోంది. వానకాలం సీజన్లోనే ఎడాపెడా పెంచిన ధరలతో రైతులు కుదేలయ్యారు. తాజాగా యాసంగికి ముందు మరోమారు ధరల పెంపు నిర్ణయంతో కర్షకులకు మోయలేని భారం పడనున్నది. ధరలు పెరుగుతున్నాయనే సమాచారంతో ఇప్పటికే ఉన్న ఎరువుల నిల్వలను దాచేసినట్లుగా సమాచారం. ప్రభుత్వ లెక్కల మేరకు మిగులు నిల్వలు ఉన్నా యి. కొన్ని కంపెనీలు పాత ధరలతో సరఫరా చేసి నా… వ్యాపారులు స్టాక్ లేదంటున్నారు. పంట సా గులో విత్తనాలు, ఎరువులే కీలకం. ఆశించిన దిగుబడులు పొందేందుకు పంట చివరిదశ వరకు నా లుగైదు సార్లు ఎరువులు వేస్తారు. ఈ లెక్కన ఎరకానికి రూ.3-4 వేలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో కారణంగా అదనంగా రైతులకు ఎకరానికి రూ.1000 నుంచి రూ.2000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు రైతులు విరివిగా ఉపయోగించే పొటాష్(ఎంవోపీ) ధర రూ.850 ఉండగా ప్రస్తుతం రూ.1700 చేరింది. అంటే రూ.850 చొప్పున పెరుగుదల కనిపిస్తోంది. 50శాతం మేర పెంపుతో రైతుకు ఇబ్బందికరమైన దుస్థితి ఏర్పడుతున్నది. సాగు రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిపై మోదీ సర్కారు కర్కషంగా వ్యవహరిస్తుదంటూ అన్నదాతలు మండిపడుతున్నారు.
ఇప్పటికే ఇంధన ధరలతో కుదేలు…
ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచడంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది. యాంత్రీకరణలో దూసుకుపోతున్న సాగు రంగం పై పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం చూపింది. కేంద్రం పెంచిన ఇంధన ధరలు ఇప్పటికే రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇది వరకు ఏడాదికి ఒకటి రెండు సార్లు పెంచినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. నిత్యావసరంగా మారిన ఇంధన ధరలను మొన్నటి వరకు రోజురోజుకూ పెంచడంతో సామాన్య ప్రజలతోపాటు అన్నదాతలకు కూడా కష్టాలు తప్ప లేదు. 2020 జూన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.49 ఉంది. ప్రస్తుతం రూ.110.10 చేరింది. దాదాపు రూ.35 వరకు అదనపు భారం పడుతున్నది. డీజిల్ సైతం రూ.69.15 ఉండగా ఇప్పుడు లీటర్ డీజిల్ రూ.వందకు చేరువైంది. డీజిల్‌పైనా దాదాపు రూ. 30 పెరిగింది. ఇంతటి పెను భారంతో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. పంటలు సాగు చేసే రైతుకు ఏడాదికి ఎకరాకు అదనంగా రూ.3వేల నుంచి రూ.3,500 వరకు ఖర్చు అవుతున్నది. ఇతర పంటలు సాగు చేసే వారు రూ.2వేల వరకు అదనపు వ్యయం వెచ్చించాల్సి వస్తోంది.
రైతు వ్యతిరేకి బీజేపీ…
భారతీయ జనతా పార్టీ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే పార్టీగానే మారిపోయిందనే వాదనకు ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు నిజం చేస్తున్నాయి. బ్యాంకులకు రూ.వేల కోట్లు అప్పులను ఎగ్గొట్టి దేశాలు వదిలిపెట్టి వెళ్తున్న వారికి రెడ్ కార్పెట్ వేస్తున్న మోదీ ప్రభుత్వమే… సామాన్య రైతులకు మేలు చేసేందుకు ఒక్క నిర్ణయం తీసుకోవడం లేదు. పంటల బీమా పథకాలకు మంగళం పాడడం దగ్గరి నుంచి మద్దతు ధరను అమలు చేయడంలో బీజీపీ అడుగడుగునా విఫలం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ధాన్యం సేకరిస్తే… మర ఆడించిన బియ్యం సేకరించకుండా కొర్రీలు పెట్టి రాజకీయం చేసింది. 75 ఏండ్ల భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పక్కా రాజకీయాలకు వాడుకుని అభాసుపాలైంది. ఎరువుల కంపెనీలకు చీమ కుట్టినా కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు అనే ఓ వంకను అడ్డం పెట్టి ఎరువుల ధరను ఇష్టమొచ్చినట్లు పెంచి రైతులను నిలువునా ముంచుతున్నారు. ఇదేమంటే కనీసం జవాబివ్వకుండా తప్పించుకుంటున్నారు. కేంద్ర సర్కారు ఇంత హేయమైన చర్యలు తీసుకుంటుంటే నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ ఎంపీ అర్వింద్ ఇందుకు విరుద్ధంగా వక్రభాష్యం చెబుతుండడం హాస్యాస్పదంగా మారిందని ప్రజలు అనుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాపై రూ.50 కోట్లకు పైగా అదనపు భారం
కామారెడ్డి, జనవరి 14 : కేంద్రం పెంచిన ఎరువుల ధరలతో కామారెడ్డి జిల్లాపై అదనంగా రూ.50 కోట్లకు పైగా అదనపు భారం పడనున్నది. జిల్లాలో 5.38 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నది. ప్రతి వర్షాకాలం, యాసంగిలో పంటల సాగు పెరుగుతున్నది. దీంతో ఎరువుల వాడకం పెరిగింది. కామారెడ్డి జిల్లాకు లక్ష మెట్రి క్ టన్నుల ఎరువులు ప్రతి ఏటా అవసరం అవుతున్నాయి.యూరియా 62,000 మెట్రిక్ టన్ను లు, డీఏపీ 12,000 మెట్రిక్ టన్నులు, కాంప్లె క్స్ ఎరువులు 25,000, పొటాష్ 4,000 మెట్రిక్ టన్నుల చొప్పున అవసరం అవుతాయి. ధరల పెరుగుదలతో జిల్లాలోని రైతుపై రూ.50 కోట్ల మేర అదనపు భారం పడనున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సు మారు రూ. 350 నుంచి 450 ధరలు పెరిగాయి.