పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ మెదక్ రూరల్, ఏప్రిల్ 1 : ఉగాది పండుగ పురస్కరించుకొని పెద్దశంకరంపేట పట్టణంలోని దుర్గామాత ఆలయాన్ని ఉత్సవాలకు ముస్తాబు చేశారు. ఆలయ ఆవరణలోని కేశమ్మ, గంగమ్మ, షాదీఖాన వద్ద కొండలరాయుడి ఆల యాలను అలంకరించారు. ఉగాది పండుగ రోజు దుర్గమ్మ అలయం వద్ద జాతర, బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. జాతరకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు. గంగమ్మ, కేశమ్మ ఆలయాలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలు శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం బండ్ల ఊరేగింపు, ఆదివారం పోచమ్మ అమ్మవారికి బోనాలు, బండ్ల ఊరేగిం పు, సోమవారం వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్నారు.
మెదక్ రూరల్ మండలంలోని ఆలయాలు ఉగాదికి ముస్తాబయ్యాయి. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకలు, విశేష అర్చనలతోపాటు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మంబోజిపల్లి, మాచావరం,రాజ్‌పల్లి, తిమ్మకపల్లి, రాయిన్‌పల్లి గ్రామాల్లోని ఆలయాల్లో గ్రామ దేవతలకు ఎండ్ల బండ్లు ఊరేగింపు, బోనాలు నిర్వహిస్తారు.
శివ్వంపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న భగలాముఖి శక్తిపీఠం నిర్మాణ స్థలంలోని బాలాలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా శక్తిపీఠం ఉపాసకులు వెంకటేశ్వరశర్మ విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలతోపాటు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. శివ్వంపేట మాజీ సర్పంచ్ పబ్బ రమేష్‌గుప్తా, స్వరూప దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఉపాసకులు వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ.. బాలాలయంలో 6.9 అడుగుల కృష్ణ శిలా విగ్రహంతో అమ్మవారు త్వరలోనే దర్శనం ఇస్తారని తెలిపారు.
రామాయంపేట/ మెదక్ రూరల్, ఏప్రిల్ 1 : రామాయంపేట పట్టణంలోని దేవాలయాల్లో ఏప్రిల్ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేంకటేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకుడు వెంకటరమణాచార్యులు పద్మావతీ అమ్మవారికి, సాయిబాబ ఆలయంలో శ్రీధర్‌శర్మ, దత్తాత్రేయ ఆలయంలో రాఘవేందర్చారి, కూర్మాచలంలో శ్రీనువాసచార్యులు అమ్మవార్లకు పూ జలు, మంగళ హారతులు ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అయ్యప్ప ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు.
మెదక్‌రూరల్ మండలం మంబోజిపల్లి శివారులోని కొయ్యగుట్ట పై కొలువుదీరిన మల్లికార్జునస్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకోని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, శని పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజారి మల్లన్న మాట్లాడుతూ ఉగాది పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
మెదక్ మున్సిపాలిటీ/మెదక్, ఏప్రిల్ 1 ః ‘శుభకృత్’ నామ సంవత్సరం పట్టణ ప్రజలకు సుఖ సంతోషాలను ఇవ్వాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఉగాది పండుగ శుభకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ ఆర్థికంగా ఎదిగి సుఖసంతోషాలతో ఉండాలన్నారు. జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులందరికీ శుభకృత్ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ తెలిపారు. ఎంచుకున్న రంగాల్లో గమ్యా న్ని చేరే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.