తెలుగు వత్సరాది.. ఉగాది వచ్చింది.. శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవ నామ సంవత్సరం వెళ్లిపోయింది. సకల శుభాలు కలిగించే ‘శుభకృత్’ను స్వాగతిస్తూ ఈ పర్వదినం తమ జీవితాల్లో కోటి కాంతులు నింపాలని కోరుకుంటూ ‘ఉగాది’ని నేడు ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పంచాంగ పఠనాలు, పచ్చళ్ల పంపిణీ, ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 1
గడిచిన ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, రాబోయే సంవత్సరం తమ జీవితాల్లో కొత్త కాంతులను నింపాలనే ఆకాంక్షతో మరో వసంతాన్ని స్వాగతించడమే ఉగాది పరమార్థం. తెలుగు నాట కాలగమనం ప్రారంభమైంది ఈ రోజునే కావడం విశేషం. సకల చరాచర సృష్టికి బ్రహ్మదేవుడు బీజం వేసింది ఈ రోజునేనంటారు. నిజానికి ఈ ‘యుగాదే’ కాల ప్రవాహంలో ‘ఉగాది’గా పరిణమించిందని చెబుతారు. సంప్రదాయ వాదుల మధ్య సౌహార్ద్రతను, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఉల్లాసాన్ని ద్విగుణీకృతం చేసే ఈ అపురూప వేడుకను శనివారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించి, షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడిని స్వీకరించి, బూరెలు లాగించి, కబుర్లలో మునిగితేలనున్నారు. దేవాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకోగా, వేద పండితుల పంచాంగ పఠణాలు చేసి భవిష్యత్‌ను ఆవిష్కరించనున్నారు.
తెలుగువారి పండుగల్లో ఉగాది తొలి పండుగ. ఈ పండుగ పుట్టుకకు సంబంధించి అనేక పురాణగాథలున్నాయి. వేదాలను తస్కరించిన సోమకాసురుడి బారి నుంచి వాటిని కాపాడి, బ్రహ్మదేవుడికి అప్పగించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడని పౌరాణిక గాథ. శ్రీ మహావిష్ణువు చైత్రశుద్ధ పాఢ్యమి నాడే మత్స్యావతారం ఎత్తాడని చెబుతారు. కనుకే శ్రీ మహావిష్ణువు అవతార గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. చైత్రశుద్ధ పాఢ్యమి నాటికి ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందనీ, కృష్ణావతారం ముగిసిన ఆ రోజే భువిలో కలి ప్రవేశించిందని, అందు వల్ల ఉగాదిని ఆ రోజు జరుపుకోవడం ఆచారమైందని చెబుతారు. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి, ఉగాది పచ్చడి తయారు చేసి, దైవానికి నైవేద్యంగా సమర్పించాకే స్వీకరించాలి. పచ్చడిలో చేదు, తీపి, పులుపులను జీవితంలోని సుఖ దుఃఖాలకు అన్వయిస్తారు. జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనంలాంటిదన్న వేదాంత సారాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.
ఈ రోజు ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంశాలు గల శాస్త్రం. పంచాంగ శ్రవణం ద్వారా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం ఫలితాలను తెలుసుకుంటే గంగా స్నాన ఫలం కలుగుతుంది. భూమిని, బంగారాన్ని, గోవులను, ఏనుగులను మొదలైన వాటిని దానమిస్తే కలిగే ఫలం పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని పండితులు చెబుతుంటారు.
ఉగాది వేడుకల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చింతన భావాలతో పాటు ఆరోగ్య సూత్రాలూ మిళితమై ఉన్నాయి. ఆరు రుతువుల్లో సహజంగా వాత, పిత్త, కఫ దోషాలు కలుగుతాయి. వీటిని ఆయుర్వేద నిపుణులు త్రిదోషాలుగా పేర్కొంటారు. వసంత రుతువులో కఫం ప్రకోపిస్తుంది. దాన్ని నివారించేందుకు కటు, తిక్త, కషాయ రసాలు ఉపకరిస్తాయి. అందుకే ఉగాదిన సంపూర్ణ ఆరోగ్యానికి షడ్రుచులను పచ్చడి రూపంలో స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిలో వినియోగించే వస్తువుల్లో కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, మామిడికాయలు, పచ్చిమిరప, వేపపువ్వు ప్రాశస్త్యం పొందాయి. వీటినే బెల్లం (తీపి), చింత (పులుపు), లవణం (ఉప్పు), కటువు (కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు) అనే షడ్రుచుల మేళవంగా పేర్కొంటారు. భిన్నమైన రుచులను ఒక చోట చేర్చడం జీవితంలోని సమన్వయత్వానికి సంకేతం. ఈ పండుగ వచ్చేటప్పటికి రుతువుల్లోని తేడా వల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యాన్ని తొలగించేదే ఉగాది పచ్చడి.
కొంగు బంగారము ననగ కొలుచుచుండ
త్రినగరి జనులు ఎల్లరు తృప్తి పడగ
అండగా నుండ భద్రకాళి అందరికిని
శుభకృతు ఉగాది రావమ్మ!శుభము లీయ!
ఓరుగల్లు పట్టణమున ఓర్పు మీర
విష్ణు, గోవింద రాజన వెలసి యిచట
మాకు కొండంత అండగ మసులు చుండ శుభకృతు ఉగాది రావమ్మ!శుభము లీయ! కాకతీయుల కళలకు కట్టినిల్లు
వేయి స్తంభాల గుడిలోన వెలుగునందు
కొలువైన శివుడు తీర్చగా కోర్కెలన్ని
శుభకృతు ఉగాది రావమ్మ!శుభము లీయ!
ప్రకృతి శోభల వెలుగొందు పరిసరముల
కొండ గుహలందు నిండుగా కొలువు దీరి అమ్మ పద్మాక్షి ప్రజలకు అభయమిడగ
శుభకృతు ఉగాది రావమ్మ!శుభము లీయ!
కాజిపేటలోన, జనుల కనికరించి
అష్ట సంపదలన్నియు అందజేయ
శ్వేత అర్క గణపతియు స్థిరముగుండ
శుభకృతు ఉగాది రావమ్మ!శుభము లీయ!
తేట గీతుల చక్కంగ తెలుపుకుంటి
స్వాగతమును పలుకుచుంటి సంతసమున
చూపుమమ్మ! పండుగ రోజు సోషలిజము
శుభకృతు ఉగాది రావమ్మ! శుభము లీయ!
-రచన: యల్లంభట్ల నాగయ్య,
రిటైర్డ్ లెక్చరర్, వడ్డెపల్లి, హనుమకొండ