
జ్వరమొచ్చినా, ఏదైనా అనారోగ్య సమస్య అయినా వెంటనే సమీపంలోని పట్టణాలకు, నగరాలకు పరిగెడుతుంటాం. పల్లెటూళ్లో ఉండే వారు వారికి నచ్చిన స్థానిక ఆర్ఎంపీలను సంప్రదిస్తుంటారు. ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఆన్లైన్ సేవలపై ప్రజలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అలాగే గ్రామాల్లో వైద్య పరీక్షలు పట్టణ, నగరాల్లోని వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించుకునేందుకు టెలీ మెడిసిన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంతో వైద్య పరీక్షలు, మందులు, ఆరోగ్య సలహాలు వంటివి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. సాధారణ రోజుల్లోనూ టెలీ మెడిసిన్ సేవలు ఎంతో మంది రోగులకు ఉపయోగపడుతాయి. సమయం, ఖర్చు ఆదా అవుతుండడడంతో టెలీ మెడిసిన్ సేవలను ఉపయోగించుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు సుమారుగా 2,102 మంది టెలీ మెడిసిన్ సేవలను సద్వినియోగం
చేసుకున్నారు.
ఆగస్టు నుంచి టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి రాగా సూర్యాపేట జిల్లాలో ఆగస్టులో ఏడుగురు, సెప్టెంబర్‌లో 264 మంది, అక్టోబరులో486 మంది, నవంబరులో 578మంది, డిసెంబరులో 767మంది, జనవరిలో 236 మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 123 మంది, రేపాల 319 మంది, పెంచికల్‌దిన్నె 197, కల్మల్చెరువు 146, లింగగిరి 102, రాజీవ్‌నగర్ 79, గరిడేపల్లి 83, పెన్‌పహాడ్ 79, కాపుగల్లు 78, కోదాడ కేంద్రంలో 65 మంది సేవలను పొందారు. టెలీ మెడిసిన్ సేవలపై ఆరోగ్య సిబ్బంది విస్తృత ప్రచారం చేపడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు
అవగాహన కలిగిస్తున్నారు.
టెలీ మెడిసిన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి…
జిల్లాలో టెలీ మెడిసిన్ సేవలను ఉపయోగించుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద రోగులు ఈ వైద్యంపై మొగ్గు చూపుతున్నారు. ఈ విధానం ద్వారా గ్రామాల్లోని పేద రోగులకు ఆర్థిక భారంతో పాటు దూరభారం తప్పుతుంది. స్థానిక పీహెచ్‌సీల నుంచే వైద్య నిపుణులతో వీడియో కాల్ ద్వారా రోగులు తమ సమస్యలను చెప్పి పరిష్కారాలు పొందుతున్నారు. రోగులు టెలీ మెడిసిన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.