సూర్యాపేటలో బోనాల పండుగ వైభవంగా సాగింది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాల నడుమ గురువారం ఊర ముత్యాలమ్మకు బోనాలు తరలివెళ్లాయి. పట్టణ మంతా సందడి నెలకొ న్నది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా చేసుకునే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌దే నన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ప్రతిచోటా ప్రశాంత వాతావరణంలో బోనాలు నిర్వహించుకోవాలని సూచించారు.
బొడ్రాయిబజార్, ఆగస్టు 12 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఊర ముత్యాలమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే అమ్మవారికి బోనాల సమర్పణకు భక్తులు బారులుదీరారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, బోనాల పాటలు, యువకుల నృత్యాలతో పట్టణమంతా సందడి నెలకొంది. అమ్మవారికి చీరె, సారె సమర్పించడంతోపాటు కోళ్లను, యాటలను మొక్కులుగా చెల్లించుకున్నారు. మహిళలు పెద్దఎత్తున బోనాలు తీసుకొచ్చి డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. కరోనా నిబంధనల మేరకు భక్తులు మాస్కులు ధరించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పట్టణ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.