బొడ్రాయిబజార్, ఆగస్టు 11 : పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సంబంధిత అధికారులకు సూచించారు. సూర్యాపేట పట్టణంలో పారిశుధ్య పనులను అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డితో కలిసి బుధవారం వార్డుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కస్తూరిబజార్లో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఇంటి యజమానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రోడ్డుపై వాహన, పాదచారులకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన ర్యాంపులను తొలగించాలని, ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల యజమా నులను శుభ్రం చేసుకోవాలని నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. చంద్రన్నకుంటలో రోడ్లపై కట్టి వేసిన బర్రెలు, రాళ్లను తీసేయాల్సిందిగా సూచించారు. డబుల్ బెడ్రూం, రాపోలు గుడి ప్రాంతాలు, పాత జాతీ య రహదారిపై జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : పల్లెప్రగతిలో పూర్తి కాని వైకుంఠ ధామాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. మండలంలోని పిన్నాయిపాలెం, సపావట్ తండాల్లో వైకుంఠధామాల నిర్మాణ పరిశీలించి మాట్లాడారు. 10 రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సెగ్రిగేషన్ షెడ్డులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, ఎంపీఓ పరాంకుశరావు, ఏఈ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి నందు, సిబ్బంది పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ : మండలంలోని దుబ్బతండాలో వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం, నిర్మాణ పనుల్లో అధికారులు అలసత్వం వహించడంపై అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలోని అభివృద్ధి పనులు పరిశీలించి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిలో తీసుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు . మండలం అగ్రస్థానంలో నిలిచేలా ముందుకెళ్లాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటాచారి, ఎంపీఓ ఆంజనేయు లు, ఈసీ ఏకస్వామి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఉన్నారు.