గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఆదర్శ మార్కెట్ ఉండాలన్న లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు గండి కొట్టింది. అందుబాటులోకి వచ్చిన మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ విజయ్‌కుమార్ దాట్ల ఫౌండేషన్, బయోలాజికల్, లైట్‌హౌస్ ఫౌండేషన్ సంస్థలకు పలు చోట్ల సీఎస్ఆర్ పద్ధతిలో పలు చోట్ల మోడల్ మార్కెట్లను కట్టబెట్టారు. వాస్తవంగా అందుబాటులోకి వచ్చిన చోట స్థానికులకు సూపర్ మార్కెట్లలా ఈ మోడల్ మార్కెట్లు ఉపయోగపడాలి. కానీ మోడల్ భవనాలను ఏకంగా సీఎస్ఆర్ కింద ఫౌండేషన్లకు అప్పగిస్తున్నారు.
తాజాగా, సీఎస్ఆర్ కింద తార్నాకలోని మోడల్ మార్కెట్ భవనాన్ని లైట్ హౌస్ ఫౌండేషన్‌కు అప్పగిస్తూ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. పేద మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఆయా అంశాల్లో తగిన శిక్షణతో నైపుణ్యం కల్పించడంతో పాటు వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా, ఉపాధి పొందేలా సహకరిస్తామని సదరు ఫౌండేషన్ జీహెచ్ఎంసీకి తెలియజేసింది. అయితే మున్ముందు ఇంకెన్నీ మోడల్ మార్కెట్ భవనాలు ఇతర అవసరాలకు మళ్లిస్తారో అంతు చిక్కడం లేదు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో ప్రతి పది వేల మందికి ఒక మోడల్ మార్కెట్ ఉండాలనే లక్ష్యంతో మోడల్ మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టిన జీహెచ్ఎంసీ.. దాదాపు 40 మోడల్ మార్కెట్లు నిర్మించింది. అయితే వాటిని మోడల్ మార్కెట్లుగా వినియోగంలోకి తీసుకురావడంలో విఫలమైంది. అంతేకాకుండా పురోగతిలో ఉన్న పనులను పట్టించుకోవడం లేదు.
చిక్కడపల్లిలో రూ. 40కోట్లు, అమీర్‌పేట రూ. 13.20కోట్లు, పంజాగుట్టలో రూ.6.70 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా పనులను పక్కన పెట్టారు. ఫలితంగా స్థానికులు వారంతపు సంతలపై ఆధారపడడం, జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. కమిషనర్ స్పందించి మోడల్ మార్కెట్లపై సమీక్షించి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రశాంతమైన వాతావరణం, వేజిటేబుల్, నాన్‌వెజ్, స్టోర్ వేర్వేరుగా ఉంటున్నాయి. శాకాహార, మాంసాహార అమ్మక కేంద్రాలు, తినుబండారాల దుకాణాలు, ఫార్మసీ, ఏటీఎంలు, గ్రాసరీ దుకాణాలు, డ్రైఫ్రూట్ దుకాణాల ఏర్పాటు జీ+1 నిర్మాణంతో ఈ మోడల్ మార్కెట్ల నిర్మాణం జరిపారు. ఈ మార్కెట్లు 10,000 లీటర్ల సామర్థ్యంలో భూగర్భ సంప్‌లు, 10వేల లీటర్ల సామర్థ్యం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, బోర్‌వెల్‌తో సహా సదుపాయంతో ఉన్నాయి.
డిజిటల్ స్టాల్స్‌ను ఏర్పాటు, ధరల పట్టిక సైతం డిజిటల్లో డిస్ప్లే చేయనున్నారు. దళారుల ప్రమేయం లేకుండా రూపాయి అదనంగా అమ్మకం లేకుండా నమ్మకమైన ధరలతో నిత్యావసర వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉండేలా ఈ మార్కెట్ నిర్మాణం జరగడంతో పాటు వినియోగంలో స్థానికులు ఉపయుక్తంగా ఉండాలి. మోడల్ మార్కెట్లు కొత్తగా నిర్మించకపోగా, ఉన్నవి ప్రైవేట్ పరం చేసి వారంతపు సంతలతో ట్రాఫిక్ కష్టాలకు కారణమవుతుండడం గమనార్హం.