లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుగాలి కలెక్టర్ పమేలా సత్పతి
తుర్కపల్లి, సెప్టెంబర్ 29 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలోని రైతు వేదిక భవనంలో బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి దళితబంధు నిధుల వినియోగం, యూనిట్ల ఎంపికపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. లబ్ధిదారులు తమకు వృత్తి నైపుణ్యం కలిగిన పాడి పరిశ్రమ రంగంతో పాటు ఇతర రంగాల్లో శాశ్వత జీవనాధారానికి నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళిత వర్గాల అభివృద్ధికి ఉద్దేశించిన ఈపథకాన్ని వందశాతం సద్వినియోగ పర్చుకోవాలన్నారు. గ్రామంలో 76దళిత కుటుంబాలకు గాను 66 కుటుంబాలకు ఇప్పటికే వారి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే డబ్బులు జమ అవుతాయని ఎవ్వరూ ఆందోళనకు గురికావద్దని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో లబ్ధి దారులంతా యూనిట్ల ఎంపికపై తుది నిర్ణయానికి రావాలని సూచించారు. గ్రామంలో ఒక వ్యక్తి ఒక యూనిట్ పెట్టుకోవడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఉంటుందని అదే గ్రామంలో 10మందీ ఒకే యూనిట్ పెట్టుకోవడం ద్వారా మార్కెట్ తగ్గిపోతుందన్నారు. అలా కాకుండా యూనిట్ ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దళితబంధు నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు ఆరుగురు సభ్యులతో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ గ్రామ కమిటీ సభ్యులు లబ్ధి దారులకు యూనిట్ల నిర్వాహణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ ఉమాదేవి పాల్గొన్నారు.