సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థల
పునఃప్రారంభానికి ఏర్పాట్లు కేజీ నుంచి పీజీ
విద్యార్థులందరికీ బోధన
తరగతి గదులు, పరిసరాలు శుభ్రం
చేస్తున్న సిబ్బందిప్రభుత్వ పాఠశాలలకు
చేరుతున్న మధ్యాహ్న భోజన బియ్యం
కొవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థుల చదువులు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్షంగా జరుగనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాసంస్థలు ఇందుకు సిద్ధమవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల నుంచి పీజీ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్ల వరకు అన్నీ తెరుచుకోనుండగా తరగతి గదులు, ఆవరణలు, మరుగుదొడ్లను శుభ్రపర్చుతున్నారు. ఐదు నెలల క్రితం వరకు 9,10 ఆపై తరగతులకు ప్రత్యక్ష తరగతులు జరుగగా మిగతా వారు సుమారు ఏడాదిన్నరగా ఇంట్లోనే చదువులు కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులు స్కూళ్లకు వచ్చేలా చూసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించడంతో ఈ మేరకు వారు చర్యలు
తీసుకుంటున్నారు. ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ముందుస్తుగానే బియ్యం పంపిణీ చేస్తున్నది. నేటి నుంచి అన్ని స్కూళ్లకు సరఫరా చేయనున్నది.
ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు
విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు మూతపడిన పాఠశాలలు, కళాశాలలు తిరిగి ఐదు నెలల కిందట ప్రారంభమయ్యాయి. రెండో దశ కేసులు విజృంభించడంతో మరోసారి
మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. వెరసి కేజీ టు పీజీ విద్యార్థులు తరగతి గదుల్లో సందడి చేయనున్నారు. ఈ నెల 31లోగా శానిటైజేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆవరణ, ఫర్నిచర్, తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లను స్థానిక పారిశుధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజనం కోసం సూపర్ ఫైన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
విద్యాసంస్థల్లో చకచకా ఏర్పాట్లు ఎల్లుండి నుంచి ప్రత్యక్ష బోధన!
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు 4,307, ఇంటర్మీడియట్ కళాశాలలు 244, డిగ్రీ కళాశాలలు 91, బీఈడీ కళాశాలలు 36, పీజీ కళాశాలలు 16 సహా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సైతం పారిశుధ్య పనులు చకచకా జరుగుతున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో 4.13లక్షలకు పైగా విద్యార్థులున్నారు. అంతటా భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చూడడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరభ్యంతర (ఎన్ఓసీ) పత్రాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ప్రతి విద్యార్థి విధిగా మాస్కు ధరించాల్సిందే.
థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి..
విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఆయా సంస్థల్లో భౌతిక దూరం పాటించాలని, మధ్యాహ్న భోజన సమయంలో విధిగా చేతులు కడుక్కొనేలా పరిశీలించాలని ఆదేశాలున్నాయి. మరుగుదొడ్లు, మైదానాల్లో విద్యార్థులు గుంపులుగా లేకుండా తరచూ ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలుంటే ఐసొలేషన్‌కు వెళ్లాలని సూచించనున్నారు. ఈ మేరకు అన్ని విద్యాసంస్థల్లోనూ ప్రత్యేకంగా ఒక గదిని అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూడనున్నారు.
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యక్ష బోధనకు ముందుగానే పాఠ్యపుస్తకాలను సరఫరా చేశారు. అవి అందని వారుంటే పాఠశాలలో అందించనున్నారు. ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాలతో అంతా సిద్ధం…
ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాం. ప్రభుత్వ మార్గదర్శకాలను ఎంఈఓలకు తెలియజేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించాం. అదే స్థాయిలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అవగాహన కల్పించాం. పూర్తిస్థాయి వసతులు కల్పించడంలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. పాఠ్యపుస్తకాలతో పాటు బియ్యం
సరఫరా ప్రారంభించాం.
సూపర్ ఫైన్ బియ్యం..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1,430 ప్రభుత్వ పాఠశాలల్లో 1,15,448 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సూపర్ ఫైన్ వెరైటీ బియ్యంతో వడ్డిస్తున్నారు. పౌష్టికాహార లోపం లేకుండా మోనూ రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలో 114క్లస్టర్ పాఠశాలల్లో ఇండెంట్ వారీగా బియ్యం సరఫరాకు సీఆర్పీలు వేలిముద్రలు నమోదు చేయించారు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి నేడు, రేపు పాఠశాలలకు బియ్యం అందనున్నాయి.