టీఆర్ఎస్ను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదు
గులాబీ జెండానే ప్రజలకు శ్రీరామ రక్ష
పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదు
ఇక్కడి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా?
అటువంటి పార్టీల జెండాలు ఇంకా తెలంగాణలో కావాలా?
సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలి
విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు
అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు
ఇవ్వనివి కూడా అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే రోల్ మోడల్‌గా నిలిపారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలని కోరుతూ సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన పార్టీ
ముఖ్య నాయకులు, కార్యకర్తల నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆయన
మాట్లాడారు. కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, వారికి ప్రజాక్షేత్రంలో విలువ లేదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాలను నిలదీయాలని పార్టీ
శ్రేణులకు పిలుపునిచ్చారు.
సూర్యాపేట, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే దమ్ము ఏ ఒక్కరికీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 2న జరుగనున్న జెండా పండుగను విజయవంతం చేయడంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు సుమంగళి, జీవీవీ ఫంక్షన్‌హాళ్లలో నిర్వహించారు. ఈ సమావేశాలకు హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఇప్పుడు యావత్ భారతదేశానికి రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. కొంతమంది జోకర్లు, బ్రోకర్ల మాటలకు ప్రజా క్షేత్రంలో విలువ లేదని ఆయన కొట్టిపడేశారు. పార్టీ, ప్రభుత్వాలు రెండూ వేర్వేరు కాదని పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నది గులాబీ సైన్యం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోనే అధికారంలోకి వచ్చాక అమలు పరుస్తారని రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ టీఆర్ఎస్ పార్టీ రూపొందించినవేనని ఆయన తేల్చిచెప్పారు. అటువంటి గులాబీ జెండాయే ఇప్పుడు తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. యావత్ దేశంలోనే తెలంగాణను ముందు వరుసలో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే నైతికత ఏ ఒక్కరికీ లేదన్నారు. ఇతర పార్టీలకు తెలంగాణలో కాలం చెల్లిందని ప్రతిచోటా ఎగురాల్సింది ఒక్క గులాబీ జెండాయే అన్నది టీఆర్ఎస్ శ్రేణులు గుర్తించాలని చెప్పారు. రాష్ట్రంలో యాత్రల పేరుతో జాతర చేస్తున్న పార్టీలు ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో ఎందుకు ఉచిత విద్యుత్ అమలు జరుగడం లేదన్నది ప్రజలకు తెలియజేయాలన్నారు. గులాబీ జెండా మరో 20 ఏండ్లు రాష్ర్టాన్ని పాలిస్తుందని ఇది తెలియక అక్కడక్కడా ఇతర పార్టీ జెండాలు దర్శనమిస్తున్నాయన్నారు. సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొనగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సమావేశాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితాఆనంద్తోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున పాల్గొన్నారు.
బీసీ కమిషన్ సభ్యులకు అభినందన
సూర్యాపేట టౌన్ : ఇటీవల బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమనేత కె.కిశోర్‌గౌడ్, న్యాయవాదుల జేఏసీ నేత సీహెచ్ ఉపేంద్రను మంత్రి జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అభినందించారు. కిశోర్‌కుమార్, ఉపేంద్ర ఆదివారం మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.