సెప్టెంబర్ 16వరకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం
టీకాతో పశువుల్లో గర్భస్రావ సమస్యలు పరిష్కారం
అనంతగిరి, ఆగస్టు 29 : అనాదిగా వ్యవసాయ సాగులో రైతులకు పశువులు అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం యాంత్రీకరణతో పశువులు పాడికే పరిమితమయ్యాయి. పాడి పశువుల ఆరోగ్యంపై సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవి అనారోగ్యానికి గురికావు. వ్యవసాయంతోపాటు పాడి ఆదాయంపై దృష్టి పెట్టిన రైతులు బర్రెలను పెంచుతున్నారు. అయితే లేగ దూడల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ తీసుకోవడం లేదు. చిన్న వయసులో టీకాలు వేయిస్తే భవిష్యత్తులో వాటికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాన్ని మరిచిపోతున్నారు. పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి ప్రాణాంతకమైనది. దీని బారినపడిన పశువులకు గర్భస్రావం కావడంతోపాటు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి బారిన పడ్డ పశువులు ఒక్కోసారి మృత్యువాత కూడా పడుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న పశువులు ఎందుకు గర్భస్రావానికి గురి అవుతున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న వయసులో ఆడదూడలకు బ్రూసెల్లోసిస్ నివారణ టీకా ఇవ్వడంతో పశువులకు గర్భస్రావ సమస్య రాదనే విషయాన్ని గ్రహించాలి.
గర్భస్రావం జరుగకుండా..
బ్రూసెల్లోసెస్ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్నారు. 4 నుంచి 8 నెలల వయసున్న ఆడదూడలకు ఈ టీకాను వేస్తారు. చిన్న వయసులో బ్రూసెల్లోసిస్ టీకా ఇవ్వకపోతే ఈ వ్యాధి సోకిన బర్రెలకు 6 నుంచి 10 నెలల మధ్య గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. పశువులు ఎక్కువగా ఆగస్టు నుంచి జనవరి మధ్యలోనే ప్రసవిస్తుంటాయి. ఈ సమయంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. పాల ఉత్పత్తిదారులు, రైతులు తమ పశువులను తరచుగా వైద్యులకు చూపిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడ దూడలకు టీకాలు వేసిన అనంతరం వైద్య సిబ్బంది వాటి చెవులకు ట్యాగ్లు వేస్తారు. ట్యాగ్ నంబర్, యజమాని పేరు, దూడ వయసును ఆన్లైన్లో నమోదు చేస్తారు. మరుసటి సంవత్సరం మళ్లీ అవే దూడలకు టీకాలు వేయకుండా ఈ ట్యాగ్ ద్వారా గుర్తిస్తారు.
తప్పక టీకాలు వేయించాలి
బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకకుండా ఆడ దూడలకు టీకాలను తప్పకుండా వేయించాలి. 4నుంచి 8 నెలల ఆడ దూడలకు వేయిస్తే మంచిది. చిన్న వయసు నుంచే పశువులకు సరిపడా పోషణ అందిస్తే పాడి సంపద పెరుగుతుంది.
-శ్రావణి, పశు వైద్యాధికారి, అనంతగిరి