వ్యవసాయ రంగానికి సర్కారు ప్రాధాన్యం
రైతుబంధు, రైతు బీమా దేశానికే ఆదర్శం
ప్రతిపక్షాలవి దివాలాకోరుతనం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ఏడేండ్లలో విప్లవాత్మక మార్పు
సీఎం కేసీఆర్ ఘనతేఆకలి చావులు,
ఆత్మహత్యలు లేని పాలనే సాక్షాత్కారం
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
రైతులు ఆత్మగౌరవంగా, గుండె నిబ్బరంగా బతికేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా దేశానికే ఆదర్శంగా నిలిచాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం శాలిగౌరారంలో వ్యవసాయ మార్కెట్ గోదాముతోపాటు రైతు వేదికను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే కిశోర్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, సరిపోను కరంట్ లేక వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు ఉండేవని, స్వరాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నీటి ప్రాజెక్టులు నిర్మించిందని అన్నారు. కాళేశ్వరం నీటితో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని
తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమొస్తదని వెకిలిగా మాట్లాడిన వాళ్లు ఏడేండ్లలో జరిగిన అభివృద్ధితో నోళ్లు మూసుకుంటున్నారని, ప్రపంచ దేశాలే తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. రైతులు పంట
పద్ధతిని మార్చుకొని లక్షాధికారులు కావాలని ఆకాంక్షించారు.
శాలిగౌరారం, ఆగస్టు 28 : రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, రైతులు ఆత్మగౌరవంగా తలెత్తుకొని గుండె నిబ్బరంగా బతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రూ.3కోట్లతో నిర్మించిన 5వేల మెట్రిక్ టన్నుల గోదాములను, రైతు వేదికను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రైతు వేదికలు అన్నదాతలకు జ్ఞానాన్ని పెంచుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చేద్దామంటే కరంట్, నీళ్లు లేకపోయేదని, స్వరాష్ట్రంలో వాటిని అధిగమించి సాగు పండుగలా మారిందని పేర్కొన్నారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి చేసిన దమ్మున్న నేత సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం నీళ్లతో సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని, ధాన్యాన్ని పండించడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. దేశంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతులు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాలని సూచించారు. బీజేపీ నాయకులు యాత్రల పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ నాయకుడు సీఎం కేసీఆర్ రైతులకు ఎకరానికి పెట్టుబడి సాయం రూ.10వేలు అందిస్తున్నారని, మీకు దమ్ముంటే కేంద్రం నుంచి రూ.15వేలు ఇప్పించాలని సవాల్ చేశారు. తెలంగాణకు అడ్డంపడిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలుసుని, ఆయన మనుషులను బీజేపీ, కాంగ్రెస్‌లో చేర్పించి తెలంగాణలో కొట్లాట పెడుతున్నాడని పేర్కొన్నారు. వాళ్ల ఆటలు ఇక్కడ సాగవని, రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు.
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి జగదీశ్‌రెడ్డి
అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, ఏడేండ్ల పాలనలో వ్యవసాయంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తదని వెకిలిగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారని పేర్కొన్నారు. 2014కు ముందు, ఇప్పుడు పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో మార్పు కండ్లకు కన్పిస్తున్నదని తెలిపారు. రైతులు పంటల పద్ధతిని మార్చుకొని లక్షాధికారులుగా మారాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మంత్రులకు పుష్పగుచ్ఛమిచ్చి, టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మంత్రులు ఎడ్లబండి ఎక్కి కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రునాయక్, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీకాంత్, ఏడీఓ శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కట్టా లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, సర్పంచులు బట్ట హరిత, గౌర వీరయ్య, కొన్రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, గంట శంకర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, నాయకులు కట్టా వెంకట్‌రెడ్డి, గుజిలాల్ శేఖర్‌బాబు పాల్గొన్నారు.
చిట్యాలలో వంగ తోట పరిశీలన
చిట్యాల : శాలిగౌరారంలో అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్తూ మంత్రి నిరంజన్‌రెడ్డి చిట్యాల మండల కేంద్రంలోని కొంతం సత్తిరెడ్డి వంగ తోటను పరిశీలించారు. సాగు విధానం, పంట దిగుబడి, మార్కెట్ గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. వంగ తోటలో కనిపించిన వయ్యారి భామ కలుపు మొక్కలను పీకేసి.. పంట చేలల్లో వయ్యారిభామ ఉండవద్దని, అవి మంచివి కావని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూమిని ప్రేమిస్తే తల్లిదండ్రులను ప్రేమించినట్టేనని, భూమి ఉన్నవారంతా రోజూ కనీసం గంట సేపైనా వ్యవసాయ పనులు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత వల్ల తెలంగాణలో విస్తారంగా సాగు వనరులు పెరిగాయన్నారు. అనంతరం రైతు సత్తిరెడ్డి పండించిన 20కిలోల వంకాయలను మంత్రి మార్కెట్ రేటు చెల్లించి కొనుగోలు చేశారు. ఆయన వెంట చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నార్కట్‌పల్లి ఎంపీపీ నరేందర్‌రెడ్డి, నాయకులు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సిలివేరు శేఖర్, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, కాకులారపు బొర్రారెడ్డి, నరేందర్‌రెడ్డి, నర్సింహ, ప్రవీణ్ పాల్గొన్నారు.
తెలంగాణలో రైతే రాజు
నార్కట్‌పల్లి : తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని వివేరా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల్లో వేరుశనగకు మంచి గిరాకీ ఉన్నందున రాష్ట్రంలో దాని ఉత్పత్తి పెంచాలన్నారు. యాసంగిలో వరితోపాటు వేరుశనగ వేసి అధిక ఆదాయం పొందాలని రైతులకు సూచించారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.