సూర్యాపేట, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా చిరుజల్లులు మొదలుకుని మోస్తరు వర్షం పడుతున్నది. అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం మొదలైన జల్లులు శుక్రవారం రాత్రి వరకూ కొనసాగాయి. వారం రోజులుగా వేసవిని తలపించే వాతావరణం నెలకొనడంతో ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో చిరుజల్లులు పడడంతో చల్లదనంతో ఉపశమనం పొందారు. తాజా వర్షాలు మెట్ట పంటలకు మేలు చేయనున్నాయి. పత్తి, వేరుశనగ పంటలతో పాటు ప్రస్తుతం వరి నాట్లకు దోహదపడనున్నాయి. శుక్రవారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు మోతె మండలంలో అత్యధికంగా 58మిల్లీమీటర్లు, అత్యల్పంగా కోదాడలో 0.8మిల్లీమీటర్లు నమోదైంది. చివ్వెంల, నాగారం మండలాల్లో 15.8 మిల్లీమీటర్లు, మేళ్లచెరువు, జాజిరెడ్డిగూడెంలో 13.3మి.మీ., సూర్యాపేటలో 10.8, చిలుకూరు 5.3, గరిడేపల్లి 3.5, నేరేడుచర్ల, తిరుమలగిరి 2.5, తుంగతుర్తి, హుజూర్నగర్ మండలాలోలలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ పట్టణంలో వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా చిట్యాల మండలంలో 10సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కేతేపల్లి మండలంలో 101.4మిల్లీ మీటర్లు, నకిరేకల్ 83.6మి.మీ., నార్కట్పల్లి 71.4మి.మీ., కట్టంగూర్ 52.6మి.మీ., శాలిగౌరారం 42.4మి.మీ., చండూర్ 2.9మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 346మిల్లీ మీటర్ల వర్షపాతానికి గాను 470.3మిల్లీ మీటర్లు (36శాతం అదనం)నమోదైంది.
కేతేపల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ ముసురు వాతావరణం నెలకొంది. ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. దాంతో గ్రామాల్లో వీధులన్నీ చిత్తడిగా మారాయి. తాజా వర్షం పత్తి, వరి సహా ఆరుతడి పంటలకు కూడా మేలు చేసింది. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి.