అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఏడేండ్లలో వ్యవసాయం పండుగలా మారి దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయని.. ప్రాజెక్టుల నిర్మాణంతో పుష్కలంగా సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
sur ఆగస్టు 27 : స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాల సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉండ్రుగొండ శివారులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం అపూర్వ ఇన్ఫ్రా వారి స్వామి నారాయణ్ టౌన్షిప్ 120ఎకరాల వెంచర్ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. గురుకుల్ నారాయణ ట్రస్ట్ దేశవ్వాప్తంగా వందలాది పాఠశాలల నిర్వహణతో మంచి విద్యాబోధన అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ గురుకుల విద్యార్థుల స్వాగత నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం తొమ్మిది మంది విద్యార్థులతో అడ్మిషన్లు ప్రారంభించి తల్లిదండ్రులకు పత్రాలను అందించారు. కార్యక్రమంలో శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు శ్రీ దేవ్ ప్రసాద్ దాస్జీ స్వామీ జీ, జ్యోతిష్య మాస్టర్ నండూరి వెంకట వేణు మాధవ్, నిత్య స్వరూప్ స్వామి, ప్రేమ్ కుమార్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఏంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
దేవరకొండ, అగస్టు 27 : ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి కొండమల్లేపల్లి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన మూత్ర పరీక్ష ల్యాబ్‌ను ప్రారంభించి మాట్లాడారు. ల్యాబ్ ఏర్పాటుతో 95రకాల పరీక్షలు ఉచితంగా అందించే అవకాశం ఉన్నదని తెలిపారు. కొండమల్లేపల్లి ఎంపీపీ రేఖారెడ్డి శ్రీధర్‌రెడ్డి పీహెచ్‌సీని దత్తత తీసుకొని రూ.15లక్షల విలువైన వైద్య పరికరాలను సమకూర్చడంతో వారిని అభినందించారు. పీహెచ్‌సీకి మరిన్ని వసతులు కల్పించేలా ఎంపీ బడుగుల నిధుల నుంచి రూ.5లక్షలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, డీఎంహెచ్ఓ కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ కృష్ణకుమారి, సర్పంచ్ కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటయ్య పాల్గొన్నారు.
మాల్, ఆగస్టు 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతాంగానికి మంచి రోజులొచ్చాయని, తాము వ్యవసాయదారులమని రైతులు సగర్వంగా చెప్పుకొంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో వ్యవసాయదారులు ఎన్నో కష్టాల కోర్చారని, విద్యుత్ లేక, పెట్టుబడి కోసం అప్పులు చేసి నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. రైతును రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, వైస్ చైర్మన్ కిష్టారెడ్డితోపాటు పాలక వర్గ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్యయాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నాంపల్లి ఎంపీపీ శ్వేత, చింతపల్లి జడ్పీటీసీలు కంకణాల ప్రవీణా వెంకట్‌రెడ్డి, పాశం సురేందర్‌రెడ్డి, ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.