ఏటికేడు పెరుగుతున్న అడ్మిషన్లు
సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు నుంచి 3,068 మంది మార్పు
సకల సౌలత్లు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నాణ్యమైన బోధనపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి
ఆలోచింపజేస్తున్న మెరుగైన ఫలితాలు.. ప్రైవేటు ఫీ‘జులుం’
వచ్చే నెల ఒకటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
నేటి నుంచి రోజూ ఉపాధ్యాయుల హాజరు
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే చాలామందిలో చులకన భావన ఉండేది. నైపుణ్యం గల ఉపాధ్యాయులున్నా పాలకుల పట్టింపు లేమితో స్కూళ్లు కునారిల్లేవి. దాంతో ఉచిత విద్య అందుతుందని తెలిసినా పిల్లలను సర్కారు స్కూళ్లకు పంపాలంటే ఆలోచించేవారు. ఇప్పుడు సీన్ మారింది. స్వరాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్లు పెరుగుతున్నాయి. మధ్యాహ్న భోజనంతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, నాణ్యమైన బోధన, మెరుగైన ఫలితాలతో సర్కారు స్కూళ్లవైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య ఎక్కువవుతున్నది.
కొవిడ్ పరిస్థితులతో దెబ్బతిన్న ఆర్థిక స్థితిగతులు, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారాన్ని మోయలేక కూడా కొందరు పేద, మధ్యతరగతి ప్రజలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ విద్యాసంవత్సరం ఈ నెల 12 వరకు 3,068 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడమే ఇందుకు నిదర్శనం. కాగా, వచ్చే నెల ఒకటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుండగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం నేటి నుంచే పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరుకానున్నారు.
మా బాబును గవర్నమెంట్ స్కూల్‌కు మార్చాం
మా బాబును ఐదో తరగతి వరకు కోదాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించాం. కరోనాతో పాఠశాలలు మూతపడడం, బడులు నడువకున్నా ప్రైవేట్ పాఠశాలలు అన్ని రకాల ఫీజులు డిమాండ్ చేస్తుండడంతో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గతేడాది ఆరో తరగతిలో చేర్పించాం. ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నది. సౌకర్యాలు కూడా పెరిగాయి. తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించాలి.
నడిగూడెం, ఆగస్టు 25 : ప్రైవేటులో అధిక ఫీజుల భారంతో విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడులవైపు చూస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ ఫీజుల మోత తప్పడం లేదని, ఆర్థిక భారం మోయలేకపోతున్నామని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడడం, ఉచిత యూనిఫాం, పుస్తకాలు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా నమోదవుతున్నది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకు పోటీ పడుతున్నారు. గతంలో కూలీకి వెళ్లే వారు సైతం తలకు మించి భారమైనా ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించేవారు. కానీ అధిక ఫీజులు, పుస్తకాలు, బస్సు ఫీజులు, ఇతరత్రా ఖర్చులు కట్టలేక పేద మధ్య తరగతి వారికి కష్టంగా మారింది. దీంతో వారంతా అధిక ఫీజులు చెల్లించలేక తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. 2021-22 సంవత్సరానికి గాను ఈ నెల 12వరకు 9,100మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందులో ప్రైవేట్ పాఠశాలల నుంచి 3,068 మంది, ఇతర పాఠశాలల నుంచి 6,032 మంది ఉన్నారు. అందులో అత్యధికంగా ఆరోతరగతిలో 502అడ్మిషన్లు ఉండడం గమనార్హం.
నాణ్యమైన విద్యకు తోడుగా…
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాలు, నాణ్యమైన బోధన అందించే ఉపాధ్యాయులు, మధ్యాహ్నం భోజనంతో పాటు ఏకరూప దుస్తులను అందిస్తుంది ప్రభుత్వం.. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు రావడానికి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులు కొనసాగిస్తూ విద్యార్థులకు చేరవయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
1నుంచి 10వ తరగతి వరకు..
ఈ నెల 12వరకు వివిధ పాఠశాలల్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1వ తరగతిలో – 527 మంది చేరగా, 2వ తరగతిలో-448, 3వ తరగతిలో-405 మంది, 4వ తరగతిలో-339, 5వ తరగతిలో-247, 6వ తరగతిలో-502, 7వ తరగతిలో-138, 8వ తరగతిలో-125, 9వ తరగతిలో-68, 10వ తరగతిలో-53మంది విద్యార్థులు చేరారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో-204, ద్వితీయ సంవత్సరంలో-12 మంది విద్యార్థులు కొత్తగా నమోదయ్యారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్నాం…
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఏ ఒక్కరూ చదువురే దూరం కాకుండదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నది. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. విద్యార్థులకు తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని అందించి భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్నది.