రూ.22లక్షలతో రైతువేదిక నిర్మాణం
వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు పూర్తి
కనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనం
కొత్త పంచాయతీలో అభివృద్ధి పరుగులు
గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో నూతన గ్రామపంచాయతీ రామన్నగూడెం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి గ్రామపంచాయతీలో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ఈ పల్లె నేడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతి పనులు పూర్తి చేసి ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించగా నేడు అవి వినియోగంలోకి వచ్చాయి. హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామమంతా పచ్చదనం సంతరించుకున్నది.
నాడు ఆవాసం.. నేడు ఆదర్శం…
రామన్నగూడెం గ్రామం 2017 సంవత్సరానికి ముందు జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం, చాకలిగూడేన్ని కలిపి రామన్నగూడేన్ని కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిధుల కొరత లేకుండా ఆవాసాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలో కృష్ణాజలాలు ఇంటింటికీ అందుతున్నాయి. మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికైన రమావత్ పీరమ్మ శీనయ్యనాయక్ రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. పల్లె ప్రగతి నిధులతో ఒక ట్రాక్టర్‌తో పాటు వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. రోజూ ఉదయాన్నే చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తుండడంతో వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి. హరితహారంలో భాగంగా గ్రామశివారులోని సూర్యాపేట-జనగాం రహదారి వెంట నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయి. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు.
గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు…
రూ.50లక్షలతో 3ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు నిర్మించారు.
రూ.22లక్షలతో రైతువేదిక భవనం.
రూ.13లక్షలతో వైకుంఠ ధామం.
రూ.3లక్షలతో రామన్నగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో బతుకమ్మ వేదికల నిర్మాణం.
రూ.9లక్షలతో 3పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు.
రూ.2లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మాణం.
అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతా…
రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములవుతున్న గ్రామ ప్రజలకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. టీఆర్ఎస్ పాలనలో అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తోడు పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయి. ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ సహకారంతో గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
ఊరు చాలా బాగుపడింది..
మా ఊరు కొత్త గ్రామ పంచాయతీ అయినంకనే చాలా బాగుపడింది. బజార్లన్నీ సీసీ రోడ్లు అయినయి. ఇంతకుముందు నీళ్లు సరిగ్గా రాక వ్యవసాయ బావుల కాడికి పోయి తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడు రోజూ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయి. గ్రామంలోనే రైతు వేదిక కట్టిండ్రు. వ్యవసాయాధికారులు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉంటున్నరు.