మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఆధునీకరణ, కొత్త నిర్మాణాలు
నేడు భూమిపూజకు హాజరుకానున్న త్రిదండి చినజీయర్‌స్వామి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి కొత్త సొబగులు రాబోతున్నాయి. భక్తుల సౌకర్యార్థం పండితుల ఆలోచనల మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో రూ.12 కోట్ల వ్యయంతో ఆలయ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ, గోదాదేవి ఆలయాలతోపాటు నాలుగు గోపురాలు, యాగశాల, పుష్కరిణి, కేశ ఖండన శాల తదితరాలతో దాదాపు ఆలయ పునఃనిర్మాణానికి సంబంధించిన మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. సోమవారం ఆలయ గర్భగుడి నిర్మాణం కోసం చేపట్టే భూమిపూజ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి హాజరుకానున్నారు.
వెయ్యేండ్లయినా చెక్కు చెదరకుండా..
రూ.12 కోట్లతో ఆలయ పునఃనిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ఎక్కువ నిధులు అవసరమున్నా తీసుకొచ్చి రాబోయే వెయ్యేండ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం విషయమై ఈ నెలలోనే చినజీయర్‌స్వామిని కలిసి చర్చించడం, ఆ మరుసటి రోజే ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి వల్లియనాగన్తో కలిసి ఆలయాన్ని పరిశీలించిన విషయం విదితమే.
నలు దిక్కులా గోపురాలు
ఆలయానికి మూడు వైపులా అంటే పడమర, ఉత్తర, దక్షణ దిశలో మూడంతస్తుల రాజగోపురాలతోపాటు తూర్పున ప్రధాన గోపురం ఏడంతస్తులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వేంకటేశ్వరస్వామివారికి ప్రధాన ఆలయ నిర్మాణంతోపాటు అలివేలు మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నిర్మించనున్నారు. అలాగే సంకట మోచన ఆంజనేయస్వామి, సుదర్శన నృసింహస్వామి ఆలయాలు నిర్మించనుండగా యాగశాల, పాకశాల, పుష్కరిణి, కేశఖండన మండపం, మాడ వీధులు, ధ్వజస్తంభం, పూజారులకు గదులు, ఈఓ పాలక మండలి కార్యాలయాలు, కల్యాణ మండపం, అన్నదాన సత్రం, స్వామివారి వాహనశాలతోపాటు భక్తులకు విశ్రాంతి గదులు నిర్మించనున్నారు.
నేడు భూమిపూజ
ఆలయ ఆధునీకరణ, పునఃనిర్మాణ పనులకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు భూమిపూజ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి హాజరుకానున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ సంఘాల సభ్యులు, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, వైద్యులు, అన్ని క్లబ్బుల సభ్యులు, న్యాయవాదులు, పుర ప్రముఖులు, భక్తులు హాజరు కావాల్సిందిగా ఆలయ కమిటీ కోరింది.