థియేటర్లో రైతన్న సినిమాను
వీక్షించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటలో రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట టౌన్, ఆగస్టు 18 : ప్రజా ప్రయోజనార్థం నిర్మించే సందేశాత్మక చిత్రాలను స్వాగతించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈశ్వర మూవీ మహల్లో రైతన్న సినిమాను ప్రేక్షకుల మధ్య వీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాల పరిణామాలను ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి రైతన్న సినిమా ద్వారా అద్భుతంగా చూపించారని కొనియాడారు. కొత్త రైతు చట్టాల ద్వారా కలిగే పరిణామాలపై రైతులను చైతన్యవంతం చేసే దిశగా సినిమా ఉన్నదని తెలిపారు. దశాబ్దాలుగా దగాపడిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, 24గంటల కరెంటు ఇస్తుంటే… కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు వ్యవసాయానికి గొడ్డలిపెట్టుగా మారిన వైనాన్ని కళ్లకుకట్టారని పేర్కొన్నారు. మట్టికీ, మనిషికీ మధ్య సంబంధాన్ని చక్కగా ఆవిష్కరించారని, చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మంత్రి కోరారు.