13,650 ఆయాలకు 7,800
30 శాతం వేతనాల పెంపుపై హర్షం
ఏడేళ్లలో రెండోసారి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 6,258 మందికి లబ్ధి
నెలకు సర్కారుపై రూ.1.52 కోట్ల భారం
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 ఉండగా 13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.6000 ఉండగా రూ.7,800కు పెంచింది. 2014కు ముందు టీచర్లకు రూ.4200, ఆయాలకు రూ.2,200 ఉండగా ఏడేండ్లలో సర్కారు మూడింతలు పెంచింది. ఉమ్మడి నల్లగొండలో 6,258 మంది టీచర్లు, ఆయాలకు లబ్ధి చేకూరనుంది. కరోనా సమయంలో నిరంతరం ప్రజా సేవలో ఉంటున్న తమను గుర్తించి ఆర్థిక తోడ్పాటు కల్పించడంపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధ్యతను మరింత పెంచేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొంటున్నారు. వేతనాల పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.1.52 కోట్ల అదనపు భారం పడనుంది.
ఏడేండ్లలో రెండో సారి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
టీచర్లు, ఆయాలకు 30 శాతం పెరుగుదల
ఉమ్మడి జిల్లాలో 6,258 మందికి లబ్ధి
సూర్యాపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఆ తరువాత అందరి వేతనాలు పెంచుతూ వస్తున్నది. వారంరోజుల క్రితం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల వేతనాలు పెంచగా .. మంగళవారం అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను 30 శాతం పెంచుతూ జీఓ విడుదల చేసింది. దేశంలోనే ఇతర రాష్ర్టాల కన్నా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మెరుగైన వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అంగన్వాడీల వేతనాలు గణనీయంగా పెంచింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంగన్వాడీ టీచర్ల వేతనాలు రూ.4200 ఉండగా ఒకేసారి రూ. 6,300 పెంచి రూ. 10,500 చేసింది. ప్రస్తుతం మారో మారు 30శాతం (రూ. 3,150) పెరిగి రూ.13,650లకు చేరుకుంది. దీంతో పాటు మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 2014కు ముందు కేవలం రూ.2200 ఉండగా రూ. 3,800 పెంచి రూ.6వేలు చేసింది. తాజాగా రూ. 1800 పెంచగా వారి వేతనాలు రూ. 7,800లకు చేరాయి. వేతనాల పెంపుతో ఉమ్మడి జిల్లాపై రూ. 1,52,55,000 అదనపు భారం పడనున్నది.
6,258 మందికి లబ్ధి
పెరిగిన వేతనాలతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 6,258 మందికి లబ్ధి చేకూరనుంది. సూర్యాపేట జిల్లాలో 1209 అంగన్వాడీ సెంటర్లలో 1209 మంది టీచర్లు, 1121మంది ఆయాలు నల్లగొండ జిల్లాలో 2093 అంగన్వాడీ సెంటర్లలో 2093 మంది టీచర్లతో పాటు 1835 మంది ఆయాలు ఉన్నారు. వీరికి 30 శాతం వేతనాలు పెంచుతూ జీఓ జారీ చేయడంపై టీచర్లు, ఆయాలతో పాటు అంగన్వాడీ యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే మెరుగైన వేతనాలు
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీరాథోడ్కు కృతజ్ఞతలు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలు పెంచడం హర్షణీయం. అభివృద్ధి, సంక్షేమాలతో పాటు వేతనాలు పెంపుదల విషయంలో సైతం దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది.